Gulmarg: స్కీయింగ్‌ సిటీపై మంచు దుప్పటి..

Gulmarg:  స్కీయింగ్‌ సిటీపై మంచు దుప్పటి..
X
శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న టూరిస్ట్‌లు

శీతాకాలం కావడంతో హిమాలయాలకు అనుకుని ఉన్న జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాల్లో జోరుగా మంచు కురుస్తోంది . దాంతో ఆయా రాష్ట్రాల్లోని పలు పర్యాటక ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. భూతల స్వర్గం జమ్ము కశ్మీర్‌ లో గత రెండు రోజులుగా భారీగా మంచు కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు కనుచూపు మేర శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి.

కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్‌ పూర్తిగా మంచుతో కప్పుకుపోయింది . నిరంతరం మంచు వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు, ఇళ్లను మంచు కప్పేసింది. స్కీయింగ్‌ సిటీ ఎటు చూసినా శ్వేత వర్ణం సంతరించుకుని పర్యాటకులను (ఆహ్వానిస్తోంది. స్థానికులు, పర్యాటకులు శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.

గుల్మార్గ్‌లో అత్యంత శీతల పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు 3.4 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రతలు మైనస్‌ 1.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. గుల్మార్గ్‌తోపాటూ ప్రముఖ పర్యాటక ప్రాంతాలు శ్రీనగర్‌, సోనామార్గ్‌, కుప్వారా, పహల్గామ్‌లో కూడా భారీగా హిమపాతం పడుతోంది. దక్షిణ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 5.6 డిగ్రీల సెల్సియస్‌, కనిష్ట ఉష్ణోగ్రతలు 2.8 డిగ్రీల సెల్సియస్‌కాగా, శ్రీనగర్‌లో పగటి ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్‌గా, రాత్రి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.

Tags

Next Story