Hemant Soren : సోరెన్ మిస్సింగ్..

మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గత మూడు రోజుల నుంచి కనిపించకుండా పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. భూ కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు ఢిల్లీలోని సీఎం హేమంత్ సోరెన్ నివాసానికి సోమవారం ఉదయం ఈడీ అధికారులు వెళ్లారు. అయితే.. ఆయన ఇంట్లో లేరని, ఆయన్ను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అధికార వర్గాలు తెలిపాయి. జనవరి 27 రాత్రి రాంచీ నుంచి ఢిల్లీకి వచ్చిన సోరెన్ ఎక్కడ ఉన్నారో తెలియడం లేదన్నారు.
భూకుంభకోణం, మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ ఈ నెల 27 సమన్లు జారీ చేసింది. జనవరి 29 నుంచి 31 తేదీల్లో ఏ రోజున విచారణకు అందుబాటులో ఉంటారో తెలియజేయాలని కోరింది. దీనిపై ముఖ్యమంత్రి స్పందించకపోవడంతో సోమవారం ఈడీ అధికారులు ఆయన నివాసానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. కాగా.. ఆయన జనవరి 31 మధ్యాహ్నం రాంచీలోని విచారణకు అందుబాటులో ఉంటానని ఈడీ అధికారులకు మెయిల్ చేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ మంగళవారం కీలక ప్రకటన చేశారు. సీఎంను కనిపెట్టి సమాచారం ఇచ్చిన వారికి నగదు రివార్డు ప్రకటించారు. రూ.11,000 బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోరెన్ ‘మిస్సింగ్’ అంటూ పోస్టర్‌ను ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా షేర్ చేశారు. మీడియా వర్గాల సమాచారం ప్రకారం అర్థరాత్రి హేమంత్ చెప్పులు ధరించి, ముఖాన్ని వస్త్రంతో కప్పుకుని, కాలినడకన ఢిల్లీలోని తన నివాసం నుంచి పారిపోయాడని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ సోషల్ మీడియాలో తెలిపారు. సోరెన్‌తో పాటు ఢిల్లీకి వెళ్లిన స్పెషల్ బ్రాంచ్ సెక్యూరిటీ సిబ్బంది అజయ్‌సింగ్ కూడా కనిపించడం లేదన్నారు. ఇద్దరి మొబైల్ ఫోన్లు కూడా స్విచాఫ్ అయ్యాయి. అప్పటి నుంచి ఈడీ, ఢిల్లీ పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ముఖ్యమంత్రి భద్రత విషయంలో ఇంతటి నిర్లక్ష్యానికి మరో ఉదాహరణ ఉండదు అని ట్వీట్ చేశారు.
ప్రభుత్వ భూముల యాజమాన్యం మార్పు కుంభకోణంలో రూ.600 కోట్లు చేతులు మారినట్లు ఈడీ ఆరోపిస్తున్నది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సొరేన్‌కు ఈడీ అధికారులు ఏడు సార్లు సమన్లు జారీ చేశారు. అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. ఈ నెల 27న కూడా ఈడీ.. సోరెన్‌కు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. జనవరి 29న గానీ, 31న గానీ అందుబాటులో ఉండాలని కోరుతూ స్పందన తెలియజేయాలని పేర్కొంది. అయితే, ఆయన 27వ తేదీన రాత్రి నుంచే అందుబాటులో లేకుండా పోయారు. ఇప్పటి వరకూ సోరెన్ ఆచూకీ తెలియరాలేదు. అతన్ని సంప్రదించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అందుబాటులోకి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాప్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com