Agnipath Scheme: అసలు ఏంటీ అగ్నిపథ్..? దీని ద్వారా యువతకు ప్రయోజనం ఏంటి..?
Agnipath Scheme: త్రివిధ దళాల్లో వేతనాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా అగ్నిపథ్ సర్వీసును తీసుకొచ్చింది కేంద్రం.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఈ పథకాన్ని ప్రారంభించారు.. ఈ ఏడాది రక్షణ రంగ బడ్జెట్ 5.25 లక్షల కోట్లు కాగా.. అందులో పెన్షన్ల వాటా లక్షా 19 వేల కోట్లకుపైగానే ఉంది.. రక్షణ రంగ బడ్జెట్‌లో సగానికిపైగా వేతనాలు, పెన్షన్లకే సరిపోతుండటంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన కేంద్రం.. అగ్నిపథ్ స్కీమ్‌ను తెరమీదకు తెచ్చింది.. ఈ షార్ట్ సర్వీస్ పద్ధతి ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, భారత ఆర్థిక వ్యవస్థకు అత్యధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు లభిస్తారని అభిప్రాయపడింది..
అగ్నిపథ్‌లో భాగంగా నియమించే సైనికులను అగ్నివీరులు అని పిలుస్తారు. వీరు నాలుగేళ్ల పాటు సైన్యంలో పని చేయొచ్చు. ఆ తర్వాత వారి పనితీరును సమీక్షిస్తారు. మొత్తం అగ్నివీరుల్లో 25 శాతం మందిని రిటెయిన్ చేస్తారు. అంటే ప్రతి 100 మందిలో 25 మందిని రెగ్యులరైజ్ చేస్తారు. వాళ్లు 15 సంవత్సరాల పాటు నాన్ ఆఫీసర్ హోదాలో పని చేయవచ్చు. అగ్నిపథ్ విధానం కింద త్రివిధ దళాల్లో నియామకాలను షార్ట్ టర్మ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేపడతారు.. 90 రోజుల్లో తొలి బ్యాచ్ నియామకం చేపట్టనున్నారు.. అందులో దాదాపు 45వేల మందికి అవకాశం కల్పించనున్నారు..
ఎంపికైన వారికి ఆరు నెలలు శిక్షణ ఇస్తారు.. మూడున్నరేళ్లు సర్వీసులో కొనసాగిస్తారు.. అగ్నిపథ్‌లో చేరిన యువతకు సైనికులతో సమానంగా ర్యాంకులు, వేతనాలు ఇస్తారు.. సర్వీసు కాలంలో 30 నుంచి 40వేల వరకు వేతనం, ఇతర సదుపాయాలు అందిస్తారు. పనిచేసిన కాలానికి వేతనం నుంచి 30 శాతాన్ని కార్పస్ ఫండ్ కింద తీసుకుంటారు.. దీనికి సమానంగా కేంద్రం కూడా తనవంతు జమ చేస్తుంది.. నాలుగేళ్ల సర్వీసు అనంతరం ఏక మొత్తంగా 11.71 లక్షల రూపాయలు అందిస్తుంది.. అంతేకాదు, బ్యాంకు నుంచి 16.5 లక్షల రుణ సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది.. దీంతోపాటు సర్వీసులో 48 లక్షల వరకు బీమా రక్షణ కూడా ఉంటుంది..
అటు ఈ అగ్నిపథ్‌పై అన్ని వైపుల నుంచి నిరసనలు వ్యక్తం అవడంతో కేంద్రం యువత అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రకటన విడుదల చేసింది.. ఆప్రకటనలో వాస్తవాలను వివరించింది.. అగ్నివీరులు నాలుగేళ్ల తర్వాత వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటే ఆర్థిక సాయం లభిస్తుందని.. ఉద్యోగాలు చేయాలనుకునే వారికి కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో, రాష్ట్ర పోలీసు నియామకాల్లో ప్రాధాన్యత ఉంటుందని చెప్తోంది. ఇక రిజిమెంట్ వ్యవస్థ దెబ్బతింటుందంటూ చేస్తున్న ప్రచారాన్ని కూడా కేంద్రం ఖండించింది.
రెజిమెంట్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు జరగవని, పైగా ఉత్తమమైన అగ్నివీరులతో వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని చెప్తోంది. ముఖ్యంగా అగ్నివీరులతో సమాజానికి ప్రమాదమని, ఉగ్రవాదులు అవుతారంటూ చేస్తున్న ప్రచారాన్ని కూడా ఖండించింది. ఇలా అనడం భారత సాయుధ బలగాల నైతికతను, విలువలను అవమానించడమేనని స్పష్టం చేసింది. అంతేకాదు, దీనిపై మాజీ సైన్యాధికారులతో విస్తృతంగా చర్చించామని, వారు కూడా స్వాగతించారని కేంద్రం చెప్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com