Yashwant Sinha: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా గురించి ఆసక్తికర విషయాలు..

Yashwant Sinha: హస్తినలో రాష్ట్రపతి రేసు మొదలైంది. ఎన్డీయే, విపక్షాల వ్యూహ, ప్రతివ్యూహాలతో రాష్ట్రపతి ఎన్నికలు మరింత పొలిటికల్ హీట్ రాజుకుంది. ఉత్కంఠను తెరదించుతూ తమ ఉమ్మడి అభ్యర్థిని విపక్షాల కూటమి ప్రకటించింది. రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రమాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను పోటీలో నిలబెట్టేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఏకగ్రీవంగా తీర్మానించాయి. టీఎంసీ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న యశ్వంత్ సిన్హా సడెన్‌గా ఆ పదవికీ, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఉదయం ట్విట్టర్ ద్వారా స్వయంగా ఆయనే వెల్లడించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడంపై మమతా బెనర్జీ, విపక్షాలకు ధన్యవాదాలు తెలిపిన యశ్వంత్ సిన్హా.. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 1937లో బీహార్ రాజధాని పాట్నాలో యశ్వంత్ సిన్హా జన్మించారు. ఐఏఎస్ అధికారిగా, దౌత్య వేత్తగాను ఆయన పని చేశారు. 24 ఏళ్ల పాటు వివిధ స్థాయిలో సేవలు అందించిన యశ్వంత్ సిన్హా .. సర్వీసులో ఉండగానే రాజీనామా చేసి 1984లో జనతాపార్టీలో చేరారు.
ఆ తర్వాత నాలుగేళ్లకు రాజ్యసభకు ఎన్నికైయ్యారు. ఇక 1989లో జనతా దళ్ జనరల్ సెక్రటరీగాయశ్వంత్ సిన్హా ఎన్నికైయ్యారు. ఆ తర్వాత చంద్రశేఖర్ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా ఏడాది పాటు పని చేసిన యశ్వంత్.. 1996లో బీజేపీ అధికార ప్రతినిధిగా పని చేశారు. 22 ఏళ్ల పాటు బీజేపీలో అనేక పదవుల్లో ఉన్న యశ్వంత్ సిన్హా.. మూడు సార్లు హజారీబాగ్ నుంచి లోక్‌సభకు ఎన్నికైయ్యారు.
అప్పటి ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి కేబినెట్‌లో ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రిగా యశ్వంత్ సిన్హా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే 2018లో బీజేపీ పాలనను వ్యతిరేకిస్తూ పార్టీని వీడారు. 2021లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి పార్టీ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఇపుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిపై పోటీ చేస్తుండటంతో టీఎంసీ పార్టీకి, ఉపాధ్యక్ష పదవికి యశ్వంత్ సిన్హా రాజీనామా చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com