Draupadi Murmu: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గురించి ఆసక్తికర విషయాలు..

Draupadi Murmu: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గురించి ఆసక్తికర విషయాలు..
Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించడంతో ఈ పేరు టాక్‌ ఆఫ్‌ ది టౌన్ అయింది.

Draupadi Murmu: ద్రౌపది ముర్ము.. ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించడంతో ఈ పేరు టాక్‌ ఆఫ్‌ ది టౌన్ అయింది. గత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎస్సీకి అవకాశమిచ్చిన ఎన్డీఏ.. ఈ సారి ఎస్టీ మహిళకు అవకాశమిచ్చింది. దీంతో ద్రౌపది ముర్ము ప్రస్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ద్రౌపది ముర్ము 1958లో ఒడిశాలోని వెనుకబడిన జిల్లా మయూర్‌బంజ్‌ బైడపోసి గ్రామంలోని పేద గిరిజన కుటుంబంలో జన్మించారు.

అనేక సవాళ్లను ఎదుర్కొని చదువును పూర్తి చేశారు ముర్ము. భువనేశ్వర్‌లోని రమాదేవి విమెన్స్ కాలేజీలో బి.ఏ పూర్తి చేశారు. మొదట టీచర్‌గా పని చేసిన ముర్ము.. కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత రాయ్‌రంగాపూర్‌ నేషనల్ అడ్వజరి కౌన్సిల్ వైస్ ఛైర్మన్‌గా పని చేశారు. 2000-2004 మధ్య ఒకసారి, 2004-2009 మధ్య మరోసారి ఒడిశా అసెంబ్లీకి ఎన్నికయ్యారు ముర్ము. బీజేపీ-బిజూ జనతా దళ్‌ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు.

ట్రాన్స్‌పోర్టు, కామర్స్‌, పశుసంవర్ధక శాఖల బాధ్యతలు చూసుకున్నారు. 2007లో అత్యుత్తమ సేవలందించినందుకు ముర్మును నీలకంఠ అవార్డుతో సన్మానించింది ఒడిశా అసెంబ్లీ. 1979-83 మధ్య ఇరిగేషన్, పవర్‌ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా సైతం ముర్ము సేవలందించారు. 1997లో బీజేపీ స్టేట్ ఎస్టీ మోర్చా వైస్ ప్రెసిడెంట్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2006-2009 మధ్య బీజేపీ స్టేట్ ఎస్టీ మోర్చా చీఫ్‌గా ఉన్నారు. 2002-2009 మధ్య బీజేపీ ఎస్టీ మోర్చా నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా ఉన్నారు.

2010, 2013లో మయూర్‌ భంజ్‌ బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2013లో బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా పని చేశారు. తర్వాత 2015-2021 మధ్య జార్ఖండ్ గవర్నర్‌గా సేవలందించారు. ముర్ముకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. జూలై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం సాధిస్తే.. దేశానికి మొట్ట మొదటి ట్రైబల్‌ ప్రెసిడెంట్‌గా రికార్డులకెక్కనున్నారు. భారత రెండో మహిళ రాష్ట్రపతిగా గుర్తింపు పొందనున్నారు. మొదటి మహిళ రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్ పనిచేశారు.

Tags

Read MoreRead Less
Next Story