Prashant Kishor: కాంగ్రెస్‌కు పీకే హ్యాండిచ్చాడా? కాంగ్రెస్సే వద్దనుకుందా..?

Prashant Kishor: కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోంది. పార్టీ పెద్దలతో చర్చల మీద చర్చలు జరిపిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉన్నట్టుండి ఎందుకు హ్యాండ్ ఇచ్చారు. కాంగ్రెస్‌కు సలహాదారుడిగా పనిచేయబోనని పీకే చెప్పడం వెనుక కారణం ఏమై ఉంటుందనే చర్చ ఊపందుకుంది. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ.. ప్రశాంత్ కిషోర్‌తో కొద్ది రోజులుగా చర్చలు జరిపింది. అవి విఫలమైన తరుణంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలపై పీకే అసంతృప్తితో పాటు పలు అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనికి కారణం రాహుల్ గాంధేనని తెలుస్తోంది. కాంగ్రెస్ వర్గాలు ప్రశాంత్ కిశోర్ ప్రణాళికకు మద్దతు ఇస్తున్నప్పటికీ.. అమలు విషయంలోకి వచ్చేసరికి ఆస్థాయి ఆసక్తిని ప్రదర్శించడం లేదని ఆయన భావిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి పూర్వ రూపు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతోన్న సమయంలో రాహుల్ విదేశీ పర్యటన పీకే అనుమానాలకు ఆజ్యం పోసిందని ఆ వర్గాలు వెల్లడించాయి.
అధిష్ఠానంలో కీలకవ్యక్తి అయిన రాహుల్ ముందుండి నడిపించాల్సిన సమయంలో దూరంగా ఉన్నారు. పార్టీ కోసం తన పర్యటనను వాయిదా వేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం విదేశాలకు వెళ్లేందుకే మొగ్గుచూపారు. ఈ క్రమంలోనే పీకే కాంగ్రెస్‌లో చేరడం లేదన్న ప్రకటనలు వెలువడ్డాయి. అటు ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరకపోవడానికి గాంధీ కుటుంబంలో అంతర్గత పోరు కూడా ఓ కారణమనే ప్రచారం జరుగుతోంది.
పార్టీని నడిపించడంపై రాహుల్, ప్రియాంకల మధ్య భేదాభిప్రాయాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రియాంక వాద్రా ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరాలని పీకే భావించారు. ప్రియాంక ఒత్తిడి మేరకే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ నేతలతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తొలిరోజు సమావేశంలో పాల్గొన్న తర్వాత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిపోయారు.
పీకే నియామకం జరగదని తేలడంతో ప్రియాంక కూడా విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు. రాహుల్ ప్రాధాన్యతను తగ్గించేందుకు పీకే చేసిన ప్రతిపాదనల వెనక ప్రియాంక హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. పార్టీపై పట్టు సాధించేందుకే పీకే ద్వారా ఆమె పావులు కదిపారని సమాచారం. ఒక దశలో ప్రియాంకను పార్టీ అధ్యక్షురాలు చేయాలని కూడా పీకే సూచించారని, కానిపక్షంలో సోనియాగాంధీని అధ్యక్షురాలిగా కొనసాగిస్తూ మరొకరిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని, రాహుల్‌ను పార్లమెంటరీ బోర్డుకే పరిమితం చేయాలని చెప్పారని తెలుస్తోంది.
కాగా, పార్టీ అధ్యక్ష పదవిని నిరాకరించిన తర్వాతా రాహుల్ పార్టీలో చక్రం తిప్పడం, తన సన్నిహితుల ద్వారా రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకోవడం ప్రియాంకకు ఇష్టం లేదని చెబుతున్నారు. పార్టీలో నాయకత్వ సమస్యను పరిష్కరించాలని ఆమె కోరినట్టు తెలుస్తోంది. కొందరు జీ-23 నేతల అసంతృప్తి వెనుక ప్రియాంక హస్తం ఉందని సమాచారం. ఇక తన సన్నిహితుల ద్వారా పీకేను అడ్డుకోవడానికి రాహుల్ గాంధీ విదేశాల నుంచే చక్రం తిప్పారని తెలుస్తోంది.
జైరాం రమేశ్, దిగ్విజయ్ సింగ్, అశోక్ గెహ్లోత్ పార్టీ అంతర్గత సమావేశంలో పీకే రాకను గట్టిగా వ్యతిరేకించారు. నేతలతో సోనియాగాంధీ చర్చిస్తున్నప్పుడే పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచన మేరకు పీకేకు వ్యతిరేకంగా పార్టీ కార్యదర్శి మాణిక్కం ఠాగూర్ ట్వీట్ చేశారని తెలుస్తోంది. చివరకు సోనియా నియమించిన సీనియర్ నేతల కమిటీ కూడా ప్రశాంత్ కిశోర్‌కు ఒక కమిటీలో సాధారణ సభ్యుడిగా అవకాశం కల్పించాలని సూచించడంతో రాహుల్ వర్గీయులు పీకేను పొమ్మనకుండానే పొగపెట్టారని తెలుస్తోంది.
కాంగ్రెస్‌లో అన్నాచెల్లెల్ల మధ్య అభిప్రాయ భేదాలు ప్రశాంత్ కిశోర్ మూలంగా తారా స్థాయికి చేరుకున్నాయని, సోనియా పుత్రప్రేమ వల్ల రాహుల్‌కు పరిస్థితులు అనుకూలంగా మారాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాహుల్‌కు పార్టీపై పట్టున్నంత కాలం కాంగ్రెస్‌లో తనకు స్వేచ్ఛ ఉండదని గ్రహించిన తర్వాతే పీకే తప్పుకున్నారనే చర్చ జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com