Hero Ajith: భారత అమ్ములపొదిలో డ్రోన్ల దండు; హీరో అజిత్ కు కీలక బాధ్యతలు

Hero Ajith: భారత అమ్ములపొదిలో డ్రోన్ల దండు; హీరో అజిత్ కు కీలక బాధ్యతలు
భారత్‌- పాక్‌ సరిహద్దుల్లో నిఘా కొరకు ఉద్దేశించిన ప్రాజెక్టు

భారత రక్షణ శాఖ హీరో అజిత్‌ కుమార్‌కు ఓ ప్రాజెక్టు అప్పగించింది. సరిహద్దు నిఘా కోసం డ్రోన్లను తయారుచేసే ప్రాజెక్టును తలైవాకు అప్పగించింది. నటుడిగా అజిత్‌ గురించి పరిచయం అక్కర్లేదు. రేసర్‌గానూ, బైకర్‌గా మాత్రమే మనకు తెలుసు. అయితే ఫ్యాకల్టీగా, వ్యాపారవేత్తగా నిజ జీవితంలో కూడా పాత్రలు పోషిస్తుంటారు.ఇందులో భాగంగా అజిత్‌ డ్రోన్లు తయారు చేస్తుంటారు. మద్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విద్యార్థులకు టెక్నాలజీ పాఠాలూ చెబుతుంటారు. ఈ నేపధ్యంలోనే ఆయనకు భారత రక్షణ శాఖ ఓ కీలక ప్రాజెక్టును అప్పగించింది.

ఇక అజిత్‌ చిన్నతనంలో విమానాల్ని చూసి అవి ఎలా ఎగురుతున్నాయో తెలుసుకోవాలనుకునేవారు. వాటిని నడపాలనీ కోరుకునేవారు. అయితే బైక్‌ మెకానిక్‌గా జీవితం మొదలుపెట్టిన ఆయన.. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చారు. అదేసమయంలో ఏరో స్పేస్‌కు సంబంధించి కొన్ని కోర్సులు చేశారు. సినిమా షూటింగుల్లో పాల్గొంటూనే ఫైటర్‌జెట్‌ నడపడానికి శిక్షణ తీసుకున్నారు. పైలట్‌ లైసెన్స్‌ కూడా సాధించారు. అజిత్‌కు పాఠాలు చెప్పడమన్నా చాలా ఇష్టం. అందుకే అన్నా యూనివర్సిటీ పరిధిలోని ఎంఐటీలోని ఏరోస్పేస్‌ విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి 2018లో స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఎంఐటీ ఆయన్ను హెలికాప్టర్‌ టెస్ట్‌ పైలట్‌,యూఏవీ సిస్టమ్‌ అడ్వైజర్‌’గా నియమించుకుంది.

మరోవైపు ఎంఐటీలో ఏరోస్పేస్‌ ప్రయోగాలు చేసే విద్యార్థి బృందం పేరు దక్ష. అజిత్‌ మొదట వారితో కలిసి డ్రోన్‌ ట్యాక్సీ, డ్రోన్‌ అంబులెన్స్‌ను తయారు చేశారు. ఎక్కువ బరువును మోస్తూ తక్కువ కాలంలో గమ్యస్థానానికి చేరే ఆ డ్రోన్‌ ఆస్ట్రేలియాలో జరిగిన ఓ ప్రపంచ పోటీలో రెండో స్థానంలో నిలిచారు కూడా. మనుషులు వెళ్లలేని ప్రదేశాలకు కూడా రక్తాన్నీ, మందులనూ చేరవేసే ఆ డ్రోన్‌కు 2019లో దేశవ్యాప్తంగా జరిగిన డ్రోన్‌ ఒలింపిక్స్‌లో ఫస్ట్ ఫ్రైజ్‌ వచ్చింది. కొవిడ్‌ టైంలో బహిరంగ ప్రదేశాల్లో రసాయనాలు చల్లడానికి అజిత్‌ తన బృందంతో కలిసి సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా పెట్రోలుతో నడిచే ఓ డ్రోన్‌ను తయారు చేశారు. ఈ డ్రోన్‌ను తమిళనాడు ఉపయోగించుకుంది. దక్ష బృందం గురించి తెలిసిన భారత రక్షణ శాఖ.. నిఘా కోసం డ్రోన్లను తయారు చేయమని దక్షను కోరింది. ఏడాదిలో దాదాపు 170 కోట్ల విలువైన 200 డ్రోన్లను తయారు చేసే ఈ కాంట్రాక్టును ఇచ్చింది. ఈ డ్రోన్‌ను భారత్‌- పాక్‌ సరిహద్దుల్లో నిఘా, సహాయ చర్యల కోసం వినియోగిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story