ashok gehlot: రాజస్థాన్ ముఖ్యమంత్రికి హైకోర్టు నోటీసులు..

న్యాయవ్యవస్థపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు రాష్ట్ర హైకోర్టు శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గెహ్లాట్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని, చర్యలు తీసుకోవాలంటూ ఓ న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ అశుతోష్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలకు గాను మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ముఖ్యమంత్రిని ఆదేశించింది.
అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చిక్కుల్లో పడ్డారు. కోర్టులు, న్యాయవ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలే తాజా వివాదానికి దారితీశాయి. ఇటీవల జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గెహ్లాట్ మాట్లాడుతూ బీజేపీ పాలనతో న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడిందన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకపోయినా దాడులు చేయిస్తున్నారని ఆక్షేపించారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉంటుందని, కానీ న్యాయమూర్తిగా ఒక్కసారి నియమితులైన తర్వాత వారితో తాను ఎలాంటి సంబంధాలు పెట్టుకోనన్నారు అశోక్ గెహ్లాట్.
ఇంతటితో ఆగకుండా న్యాయవ్యవస్థలో అంతులేని అవినీతి ఉందని ఆరోపించారు. కొన్ని కేసుల్లో జడ్జిలకు న్యాయవాదులే తీర్పును నిర్దేశిస్తున్నారన్నారు. ఇలాంటి ఉదంతాలు తన దృష్టికి వచ్చాయని కూడా చెప్పారు. అసలు న్యాయవ్యవస్థలో ఏం జరుగుతోంది..?. కింది కోర్టుల నుంచి పై కోర్టుల వరకు ఏం జరుగుతోంది అన్న దానిపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ హైకోర్టు, దిగువ కోర్టుల్లో వేలాదిమంది న్యాయవాదులు విధులను బహిష్కరించారు. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సీఎం వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేశారు. న్యాయవ్యవస్థను గౌరవిస్తానని, నమ్ముతానని చెప్పారు. అయితే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక న్యాయవాది శివ్‌చరణ్ గుప్తా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ అశుతోష్ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శనివారం విచారణ చేపట్టింది. మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని గెహ్లాట్‌ను హైకోర్టు ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com