Gyanvapi: సెల్లార్ లో పూజలు చేసుకోండి.. ముస్లింల పిటిషన్ కొట్టివేత

Gyanvapi: సెల్లార్ లో  పూజలు చేసుకోండి.. ముస్లింల పిటిషన్ కొట్టివేత
జిల్లా కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు

జ్ఞానవాపి కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. జ్ఞాన‌వాపి మ‌సీదులోని సెల్లార్‌లోని ఉన్న దేవుళ్ల‌కు పూజ‌లు చేసేందుకు వార‌ణాసి కోర్టు ఇచ్చిన అనుమ‌తిని ర‌ద్దు చేయాలంటూ ముస్లింలు పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను ఇవాళ అల‌హాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. వ్యాస్ తెహ‌ఖానాలో హిందువుల ప్రార్థ‌న‌ల‌ను కొన‌సాగుతాయ‌ని జ‌స్టిస్ రోమిత్ రంజ‌న్ అగ‌ర్వాల్ తెలిపారు. మ‌సీదు క‌మిటీ వేసిన పిటీష‌న్‌ను ఆయ‌న తిర‌స్క‌రించారు. వ్యాస్ తెహ‌ఖానా సెల్లార్‌లో హిందువులు పూజ‌లు చేసుకునేందుకు గ‌త నెల‌లో వార‌ణాసి కోర్టు అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే.

శైలేంద్ర కుమార్ పాఠ‌క్ వేసిన పిటీష‌న్ ఆధారంగా గ‌తంలో జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. త‌మ తాత‌య్య సోమ‌నాథ్ వ్యాస్‌.. 1993 డిసెంబ‌ర్ వ‌ర‌కు ఆ సెల్లార్‌లో పూజ‌లు చేసిన‌ట్లు ఆయ‌న త‌న పిటీష‌న్‌లో తెలిపారు. అయితే వార‌స‌త్వం కింద తెహ‌ఖానాకు వెళ్లి పూజ‌లు చేసుకునే అవ‌కాశం క‌ల్పించాలంటూ శైలేంద్ర త‌న పిటీష‌న్‌లో కోరారు.

కాశీ విశ్వ‌నాథుడి ఆల‌య ప‌రిస‌రాల్లో ఉన్న జ్ఞాన‌వాపి మ‌సీదులో మొత్తం నాలుగు సెల్లార్లు ఉన్నాయి. అందులో ఒక సెల్లార్ ఇంకా వ్యాస్ ఫ్యామిలీ వ‌ద్దే ఉన్న‌ట్లు తెలుస్తోంది. శైలేంద్ర వేసిన పిటీష‌న్‌ను మ‌సీదు క‌మిటీ కొట్టిపారేసింది. సెల్లార్‌లో ఎటువంటి దేవ‌తామూర్తులు లేవ‌ని ఆ క‌మిటీ పేర్కొన్న‌ది. అందుకే 1993 వ‌ర‌కు అక్క‌డ ఎటువంటి పూజ‌లు కూడా జ‌ర‌గ‌లేద‌ని మ‌సీదు క‌మిటీ తెలిపింది.

అంతకు ముందు మసీదులో సర్వే నిర్వహించింది. ఆ తరవాత ఓ నివేదిక వెలువరించింది. ఈ మసీదు ఒకప్పుడు హిందూ ఆలయం అని, దాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించారని తేల్చి చెప్పింది. మసీదులో హిందూ ఆలయ ఆనవాళ్లు కనిపించాయని స్పష్టం చేసింది.

"అంజుమన్ ఇంతెజామియా జ్ఞానవాపి మసీదులో హిందువుల పూజలు నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని కోర్టు కొట్టివేసింది. జనవరి 31వ తేదీన ఇచ్చిన తీర్పునే సమర్థించింది. ఆ తీర్పు మేరకు జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో వ్యాస్ తెఖానాలో హిందువుల పూజలు కొనసాగించుకోవచ్చని వెల్లడించింది. ఒకవేళ అంజుమన్ ఇంతెజామియా సుప్రీంకోర్టు వరకూ వెళ్తే అక్కడా పోరాటం చేస్తాం"

- అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్

ఈ కేసులో మ‌సీదు క‌మిటీ ఫిబ్ర‌వ‌రి రెండో తేదీన సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. కానీ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆ పిటీష‌న్‌ను తిర‌స్క‌రిస్తూ.. హైకోర్టును ఆశ్ర‌యించాల‌ని కోరింది. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న అల‌హాబాద్ హైకోర్టు తీర్పును రిజ‌ర్వ్‌లో పెట్టింది.


Tags

Read MoreRead Less
Next Story