Mumbai Rains : ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు..

Mumbai Rains : ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు..
X
హై టైడ్‌ అలర్ట్‌ ప్రకటించిన అధికారులు

దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో నగరం మొత్తం తడిసి ముద్దవుతోంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ కేవలం 24 గంటల వ్యవధిలో ముంబైలోని చాలా ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్‌ తెలిపింది.

ట్రాంబేలో 241 మి.మీటర్ల గరిష్ఠ వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. ఆ తర్వాత వడాలాలో 223 మి.మీ, ఘట్‌కోపర్‌లో 215 మి.మీ, వర్లీలో 204 మి.మీ, సెవ్రిలో 203 మి.మీ, బీకేసీలో 199 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబైలో అధికారులు హై టైడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ కుండపోత వర్షాలకు మహా నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి.

ఇవాళ కూడా నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని నవీ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ విపత్తు నిర్వహణ విభాగం సూచించింది. ఇక భారీ వర్షాల కారణంగా నగరంలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. పలు చోట్ల ట్రాఫిక్‌కు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైళ్లు, విమాన రాకపోకలకు సైతం ఇబ్బందులు తలెత్తాయి.

Tags

Next Story