No Pension: పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలకు పెన్షన్ కట్
ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇకపై పెన్షన్ నిలిపివేయనున్నారు. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులను అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టింది.
ఎమ్మెల్యేలు పార్టీలు మారడం సర్వసాధారణం. ఎన్నికలకు ముందు ఒక పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు.. ఎన్నికలు పూర్తయిన తర్వాత మరో పార్టీలోకి వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం. అప్పటివరకు ఒక పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు.. పార్టీ మారిన తర్వాత అదే పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించడం మనకు కళ్లకు కనిపిస్తూనే ఉంది. ఇక ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన పార్టీలు వారిపై పార్టీ ఫిరాయింపుల కింద స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం.. ఆ తర్వాత కోర్టులకు ఎక్కడం జరుగుతూనే ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రతీ రాష్ట్రంలో జరుగుతోంది ఇదే. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి ఎమ్మెల్యేల వలసలు జోరుగా సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇకపై పెన్షన్ నిలిపివేయనున్నారు. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులను అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టింది. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ (సభ్యుల భత్యాలు, పెన్షన్) సవరణ బిల్లు 2024ను సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖు మంగళవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఈ బిల్లులో ప్రస్తావించారు. ‘రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఏ సమయంలోనైనా అనర్హులుగా ఉన్నట్లయితే, చట్టం ప్రకారం ఒక వ్యక్తి పెన్షన్‌కు అర్హులు కాదు’ అని ఆ బిల్లులో పేర్కొన్నారు.
కాగా, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన కొత్త బిల్లు ప్రకారం ఇతర పార్టీలకు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పెన్షన్ నిలిపివేస్తారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఇది వర్తిస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ రాష్ట్రంలోని ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో వారిపై అనర్హత వేటు పడింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com