Himachal Pradesh: పీచు మిఠాయిని నిషేధించిన మరో రాష్ట్రం

Himachal Pradesh: పీచు మిఠాయిని నిషేధించిన మరో రాష్ట్రం
నిషేధం విధించిన హిమాచల్ ప్రదేశ్

పీచు మిఠాయి విషయంలో హిమాచల్‌ ప్రదేశ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి తయారీ, నిల్వ, విక్రయాలను ఏడాది పాటు నిషేధిస్తూ అక్కడ కాంగ్రెస్ సర్కారు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు 2025 మే 15 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. రాష్ట్రంలోని సోలన్, సిమ్లా, బిలాస్‌పూర్ సహా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పీచు మిఠాయి నమూనాలను పరీక్షించిన ఆహార భద్రత అధికారులు వీటిలో హానికారక రంగులు కలుపుతున్నట్లు గుర్తించారు. ఇవి ఆహార భద్రత ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నయని నివేదికలో వెల్లడించారు. ప్రజారోగ్యానికి ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై ఇవి తీవ్ర దుష్ప్రభావం చూపుతాయని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వీటి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఫిబ్రవరి 20న సోలన్ నుంచి సేకరించిన నమూనాలు ఆహార భద్రత ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యాయని తెలిపారు. మొత్తం ఏడు నమూనాలను సీటీఎల్‌లో పరీక్షించగా.. ప్రమాదకరమైన రసాయనం రోడమైన్-బి స్థాయిలు అత్యంత ఎక్కువ మోతాదులో ఉన్నట్టు తేలిందని చెప్పారు. పింక్ మాత్రమే కాకుండా ‘ఆరెంజ్, పర్పుల్, యెల్లో, సీ గ్రీన్, తెలుపు, గ్రీన్ వైలెట్‌లోనూ ఈ రసాయనాలు ఉన్నట్టు తేలింది. మానవ ఆరోగ్యానికి హానికలిగించే రోడమైన్-బి వినియోగిస్తున్నట్టు గుర్తించాం’ అని తెలిపారు.

అటు కర్ణాటకలో కూడా అదే కృత్రిమ ఫుడ్‌ కలర్‌తో చేసే గోబీ మంచూరియా, పీచు మిఠాయి విక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. వీటిల్లో రంగుల కోసం ఉపయోగించే రోడమైన్‌-బి అనే రసాయన ఏజెంట్‌ ఆరోగ్యానికి హానికరమని తెలిపింది. తాజాగ కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేశ్ గుండురావు మాట్లాడుతూ, కొన్ని ఆహార పదార్థాల తయారీకి హానికారక రసాయనాలు ఉపయోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోందనీ, నిపుణులు పరీక్షించిన 107 ఆహార పదార్థాల్లో రోడమైన్‌-బి, టాట్రజైన్‌ వంటి రసాయనాలను వినియోగిస్తున్నారనీ ఇవి ఆరోగ్యానికి ముప్పు తీసుకొస్తాయని అన్నారు. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సురక్షితం కాని రసాయనాలను ఉపయోగించే ఫుడ్‌ సెంటర్లపై అధికారులు కేసు నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధలను పాటించని వారికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు లైసెన్సును రద్దు చేస్తామని తెలిపారు. అయితే, ఎలాంటి రంగులద్దని తెల్లని పీచు మిఠాయి విక్రయాలపై ఎలాంటి నిషేధం లేదని, వాటి విక్రయాలు కొనసాగించొచ్చని మంత్రి స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story