RAIN ALERT: హిమాచల్‌లో భారీ వర్షాలు..11 కి.మీ. మేర స్తంభించిన ట్రాఫిక్
నైరుతి రుతపవనాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగిపడటంతో ఛండీగఢ్-మనాలీ జాతీయ రహదారిని మూసివేశారు. మనాలి-చండీగఢ్ హైవేపై దాదాపు 11 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మండి జిల్లాలోని ఔట్ సమీపంలో వందలాది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ట్రాఫిక్ జామ్ కారణంగా కనీసం వెయ్యి మంది ప్రజలు భారీ వర్షంలో చిక్కుకున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని... ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో భారీగా వాహనాలు స్తంభించాయని అధికారులు తెలిపారు. సమీపంలో హోటల్ గదులు కూడా అందుబాటులో లేకపోవడంతో రాత్రంతా ప్రజలు వాహనాల్లోనే బస చేయాల్సి వచ్చింది. రహదారి పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని భారీ బండరాళ్లను పేల్చేందుకు పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నామని మండి జిల్లా అధికార యంత్రాంగం వెల్లడించింది. రహదారిలో రాకపోకలను ఏడు నుంచి ఎనిమిది గంటల్లోపు పునరుద్ధరిస్తామని తెలిపారు. జాతీయ రహదారిని పునరుద్ధరించే వరకు ప్రయాణికులు మండి జిల్లా వైపు రావద్దని సూచించారు. రహదారిని మూసివేయడంతో ఆదివారం సాయంత్రం నుంచి ఇక్కడే చిక్కుకపోయామని ఓ వాహనదారుడు తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయని చెప్పారు. ఆకస్మిక వరదల కారణంగా హనోగి సమీపంలోని మండి నుంచి మనాలీ వెళ్లే జాతీయ రహదారిని మూసివేశారు. దాదాపు 200 మంది యాత్రికులు వరదల్లో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. హనోగీ మాతా ఆలయ సమీపంలోని మండి జాతీయ రహదారిపై ఆకస్మిక వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. మనాలి నేషనల్ హైవేపై కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వరదలు పోటెత్తడంతో పలుచోట్ల వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. రాళ్లు, మట్టి కొట్టుకు వచ్చి ఇళ్ల ముందు, రహదారుల మీద భారీగా పేరుకుపోయింది. వరదల ధాటికి చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. ధర్మశాలలోని కాంగ్రాలో 104 మిలీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. కటౌలాలో 74.5, గోహర్ లో 67, మండీలో 56.4, పాలంపుర్ లో 32.2 మిలీ మీటర్ల వర్షపాతం నమోదైంది. హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com