Supreme Court: హిందూ వితంతువు మరణిస్తే..ఆమె ఆస్తి భర్త వారసులకే..

Supreme Court:  హిందూ వితంతువు మరణిస్తే..ఆమె ఆస్తి భర్త వారసులకే..
X
వారసత్వ హక్కుపై వివాదంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య

వివాహం తర్వాత మహిళ గోత్రం మారుతుందని, కన్యాదానం తర్వాత ఆమె బాగోగుల బాధ్యత భర్త తరపు బంధువులదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. సంతానంలేని వితంతువు చనిపోతే ఆమె ఆస్తి మొత్తం అత్తింటి వారికే చెందుతుందని తీర్పు వెలువరించింది. కరోనా సమయంలో మరణించిన ఓ దంపతులకు సంబంధించిన ఆస్తిపై వారి తల్లులు సుప్రీంకోర్టులో దావా వేశారు.

భర్త మరణించగా వితంతువుగా మారిన మహిళ కొంతకాలానికి మృతి చెందింది. వీలునామా రాయకపోవడంతో ఆమె ఆస్తిపై వివాదం నెలకొంది. తల్లిగా తన బిడ్డ ఆస్తి తనకే చెందుతుందని ఆ భార్యాభర్తల తల్లులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ ధర్మంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆచారాలను తమ తీర్పుతో ప్రభావితం చేయలేమని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న వ్యాఖ్యానించారు.

కన్యాదానం తర్వాత మహిళ గోత్రం మారుతుందని, ఆ తర్వాత ఆమె బాగోగులన్నీ అత్తింటి వారివేనని ధర్మాసనం పేర్కొంది. ఏ వివాహిత కూడా తన పోషణ కోసం సోదరుడిపై దావా వేయలేదని జస్టిస్ నాగరత్న గుర్తు చేశారు. హిందూ వితంతువు వీలునామా రాయకుండా మరణిస్తే ఆమె ఆస్తిపై భర్త తరఫు బంధువులకే హక్కు ఉంటుందని జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

Tags

Next Story