చెన్నైలో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హిస్టరీ షీటర్ తొప్పై గణేశ్ హతం

చెన్నైలో సోమవారం ఉదయం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఓ హిస్టరీ షీటర్ హతమయ్యాడు. నగరంలోని మాధవరం రౌండానా సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని పలు హత్యలు, దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న తొప్పై గణేశ్ గా గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం, ఈ ఏడాది జనవరి 30న మాధవరం ప్రాంతంలో జరిగిన ఓ భారీ దోపిడీ కేసులో గణేశ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ ఘటనలో ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షల నగదు, 15 సవర్ల బంగారాన్ని ఓ ముఠా దోచుకుంది. ఈ కేసులో పరారీలో ఉన్న గణేశ్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. సోమవారం ఉదయం మాధవరం వద్ద అతని కదలికలపై సమాచారం అందడంతో, ప్రత్యేక బృందం అక్కడికి చేరుకుంది.
అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులపై దాడి చేసి తప్పించుకోవడానికి యత్నించాడని అధికారులు తెలిపారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గణేశ్ ను సమీపంలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
చెన్నైలో ఇటీవల వ్యవస్థీకృత నేరగాళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది కె. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన చెన్నై పోలీస్ కమిషనర్ అరుణ్, "గ్యాంగ్‌స్టర్లకు ఏ భాష అర్థమవుతుందో, పోలీసులకు ఆ భాష తెలుసు" అని వ్యాఖ్యానించి, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ దోపిడీ కేసుతో సంబంధం ఉన్న ఇతర నిందితుల కోసం గాలిస్తున్నామని, ఉత్తర చెన్నైలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని పోలీసులు వెల్లడించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
