Political Holi Celebrations :హోలీ సంబరాలకు రాజకీయ రంగు

Political Holi Celebrations :హోలీ సంబరాలకు  రాజకీయ రంగు
రంగుల ప్యాకెట్లపై ప్రముఖ నేతల ఫోటోలు

దేశంలో హోలీ సంబరాలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. దేశవ్యాప్తంగా చాలా దుకాణాల్లో హోలీ రంగుల సరంజామాలపై మోదీతో సహా ప్రముఖ రాజకీయ నేతలబొమ్మలను ముద్రించి విక్రయిస్తున్నారు. వీటికి డిమాండ్‌ కూడా భారీగానే ఉంటోందని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు హోలీ వేడుకలను నాయకులు రాజకీయ వేదికగా మార్చుకుని ప్రసంగాలతో హోరెత్తిస్తున్నారు.

గాలి పటాలపై సూపర్‌ మ్యాన్‌, హల్క్‌ లాంటి సూపర్‌ హీరోలు, సినీ తారల బొమ్మలు ఉండటం సహజమే. అలాంటి వాటికే డిమాండ్‌ ఎక్కువ ఉంటుంది. ఈసారి ఎన్నికలకు ముందు హోలీ పండుగ రావడంతో ప్రముఖ రాజకీయ నేతల చిత్రాలకు డిమాండ్‌ పెరిగింది. పలు రాష్ట్రాల్లో విక్రయిస్తున్న హోలీ పిచికారీలు, రంగుల ప్యాకెట్లపై ప్రముఖ రాజకీయ నేతల ఫొటోలను ముద్రించి అమ్మేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడటంతో ఇప్పుడు వీటికే ఎక్కువ డిమాండ్‌ ఉంటుందని దుకాణ దారులు చెబుతున్నారు. యువత, పిల్లలు కూడా వీటినే ఎక్కువ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చిత్రాలు రంగుల ప్యాకెట్లపై దర్శనమిస్తున్నాయి.

ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో హోలీ సంబరాలు కొన్ని రోజుల క్రితమే మొదలయ్యాయి. వివిధ పేర్లతో వాటిని ప్రజలు నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో నాయకులు ఈ ఉత్సవాలను రాజకీయ వేదికలుగా మార్చుకుంటున్నారు. ప్రసంగాలతో హోరెత్తిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పార్టీ రంగులను చల్లుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్ సింగ్ ధామి చంపావత్‌లో ఇటీవల హోలీ వేడుకల్లో పాల్గొని ఇలాగే ప్రసంగించారు.

వారణాసిలోని గంగానది ఒడ్డున.. ప్రధాని మోదీ అభిమానులు.. ఘనంగా హోలీ వేడుకలను నిర్వహించుకున్నారు. మోదీ మాస్కులు ధరించి, కాషాయ రంగులను చల్లుకున్నారు. ఇండియా కూటమిలోని రాహుల్‌గాంధీ, మమతా, కేజ్రీవాల్‌ తదితరులపై పాటలు పాడుకుంటూ విమర్శలు చేశారు. కాషాయ రంగు పూలు, నీటిని పిచికారిలతో చల్లుకుంటూ భజనలు చేశారు.

భాజపా ఎంపీ, ప్రముఖ బాలీవుడ్‌ నటి హేమా మాలిని.. మథురలో జరిగిన హోలీ మిలాన్‌ సమారోహ్‌లో పాల్గొని సందడి చేశారు. ఔత్సాహకులతో కలిసి నాటకాల్లో పాల్గొన్నారు. పాటలు, భజనలకు నృత్యం చేశారు. అనంతరం ప్రసంగించి.. ఈ ఎన్నికల్లో భాజపాకు 370 సీట్లు కట్టబెట్టాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు.. హోలికి ఎన్నికల ప్రచారం తోడవడంతో.. రంగులకు డిమాండ్‌ భారీగా పెరిగింది. పశ్చిమబెంగాల్‌లోని సిలిగుడిలో రంగుల తయారీ దారులు తీరిక లేకుండా పనిచేస్తున్నారు. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని గతంలో కన్నా.. ముందుగానే తయారీ ప్రారంభించినట్లు చెప్పారు. రాజకీయ పార్టీలను సూచించే రంగుల కోసం వ్యాపారులు భారీగా సంప్రదిస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా కాషాయ రంగుతో పాటు ఆకుపచ్చ రంగులకు చాలా డిమాండ్‌ ఉందన్నారు

Tags

Read MoreRead Less
Next Story