Home voting: ఇంటి నుంచే ఓటు పద్ధతి ఏంటంటే

Home  voting:  ఇంటి నుంచే ఓటు పద్ధతి ఏంటంటే
ప్రయోగాత్మక ప్రయత్నానికి కసరత్తు

మొదటి సారిగా శాసనసభ ఎన్నికల్లో ఇంటి నుంచే ఓటింగ్ అమలు కానుంది. 80 ఏళ్లు పైబడిన వయో వృద్ధులు, దివ్యాంగులు వారి ఇంటి వద్దే తమ ఓటుహక్కు వినియోగించుకునే సదుపాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం అధికారులు ముందుగానే కసరత్తు పూర్తి చేసి ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి ఓటింగ్ నమోదు చేయించాల్సి ఉంటుంది. హోం ఓటింగ్ ప్రక్రియ కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు.

ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకునే సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు 12-D ఫాంను నింపి రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారికు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారుల పాత్ర కీలకం. తమ పరిధిలోని 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల వద్దకు BLOలు వెళ్లి హోం ఓటింగ్ గురించి వివరించి వారికి 12D ఫాంను ఇవ్వాల్సి ఉంటుంది. ఓటరుకు సంబంధించిన అన్ని వివరాలను అందులో నమోదు చేసి వారి సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. దివ్యాంగులు తమ ధృవపత్రాన్ని కూడా జతపర్చాల్సి ఉంటుంది. తమ పరిధిలో వచ్చిన 12D ఫారాలన్నింటినీ BLOలు AROకు పంపాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను సెక్టార్ ఆఫీసర్ పర్యవేక్షించాలి. వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి అందులో ఇంటి దగ్గరే ఓటింగ్‌కు అర్హులైన వారిని గుర్తిస్తారు. వారిని ఆబ్సెంటీ ఓటర్లుగా పరిగణించి వారికి పోస్టల్ బ్యాలెట్ మంజూరు చేసేందుకు అనుమతిస్తారు. ఈ ప్రక్రియ నోటిఫికేషన్ వచ్చిన ఐదు రోజుల్లోపు పూర్తి కావాల్సి ఉంటుంది. రాష్ట్రంలో వచ్చే నెల మూడో తేదీన నోటిఫికేషన్ వెలువడుతున్నందున... నవంబర్ నాలుగు నుంచి ఎనిమిదో తేదీ లోపు ఆబ్సెంటీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.


ఆయా నియోజకవర్గాల పరిధిలో హోం ఓటింగ్‌కు అర్హులైన వారిని పోలింగ్ కేంద్రాల వారీగా గుర్తిస్తారు. సెక్టార్లుగా విభజించి సెక్టార్ అధికారులకు ఆ బాధ్యతలు అప్పగిస్తారు. ఆ తర్వాత ఆబ్సెంటీ ఓటర్లుగా గుర్తించిన వారి ఇంటి వద్దే ఓటుహక్కు నమోదు చేసేందుకు ఓ షెడ్యూల్ ఖరారు చేస్తారు. సెక్టార్ అధికారులు, పోలింగ్ అధికారులు, ఇతర సిబ్బంది ఓటర్ల ఇళ్ల వద్దకే వెళ్లి వారి ఓటు హక్కు నమోదు చేస్తారు. హోం ఓటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులకు కూడా ఇస్తారు. అవసరం అనుకుంటే అభ్యర్థులు వారి ఏజెంట్లను కూడా వెంట పంపవచ్చు. ఓటరు తమ ఓటు హక్కును పూర్తి రహస్యంగా వినియోగించుకునేలా కంపార్ట్‌మెంట్‌ సహా ఇతరత్రా అన్ని ఏర్పాట్లు చేస్తారు. పూర్తి స్థాయి పోలింగ్ తరహాలో ఆబ్సెంటీ ఓటర్ల నుంచి బ్యాలెట్ పత్రంపై ఓటు నమోదు చేసుకొని పోస్టల్ బ్యాలెట్ పత్రంగా సీల్డ్ కవర్‌లో ఉంచుతారు.ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటువాటిని రిటర్నింగ్ అధికారి భద్రపరుస్తారు. పోస్టల్ బ్యాలెట్లు అన్నింటి లెక్కింపు ఒకేసారి చేపడతారు.

Tags

Read MoreRead Less
Next Story