Bus Catches Fire: స్లీపర్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదుగురు ప్రయాణికులు సజీవదహనం..!

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో గురువారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదం అందరినీ కలిచివేసింది. ఢిల్లీ నుండి బీహార్ వెళ్తున్న ఓ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన లక్నో నగరంలోని మొహన్‌లాల్‌గంజ్ సమీపంలోని కిసాన్‌పథ్ వద్ద చోటు చేసుకుంది.
ఘటన జరిగిన సమయంలో ప్రయాణికుల సంఖ్య దాదాపు 60మందికి పైగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులలో చాలా మంది నిద్రలో ఉన్నారు. అకస్మాత్తుగా బస్సులో పొగ వ్యాపించడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అయితే, డ్రైవర్ కేబిన్ వద్ద అదనంగా సీటు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు బయటికి రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఇక ఘటనకు సంబంధించి పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో.. బస్సు ఎమర్జెన్సీ గేట్ పనిచేయకపోవడం వల్ల వెనుక కూర్చున్న ప్రయాణికులు బయటికి రాలేకపోయారని వెల్లడైంది. అగ్ని ప్రమాదం మొదలైన 10 నిమిషాల్లోనే మొత్తం బస్సు పూర్తిగా కాలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో డ్రైవర్, కండక్టర్ బస్సు నుండి దూకి పరారయ్యారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సమీప గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆరు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకొని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. మృతుల శవాలను బస్సు నుండి బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఒక ప్రయాణికుడి ప్రకారం, గేర్ బాక్స్ వద్ద స్పార్క్ రావడం వల్ల బస్సులో మంటలు అంటుకున్నాయని తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు బయటకు రావడానికి అవకాశంలేదని తెలిపారు. అయితే, బస్సులోని ముందు వైపు ప్రయాణికులు బయటికి రాగలిగారు. కానీ, వెనుకవైపు కూర్చున్నవారు ఇమర్జెన్సీ గేట్ తెరవకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, మంటలు ఒక కిలోమీటర్ దూరం వరకు కనిపించాయని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్, కండక్టర్ పరారీలో ఉన్నప్పటికీ వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రభుత్వం నుండి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించనున్నట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com