Ayodhya: అయోధ్యలో భారీగా పెరిగిన హోటల్ రూం ధరలు..

Ayodhya:  అయోధ్యలో భారీగా పెరిగిన హోటల్ రూం ధరలు..
5 రెట్లు పెరిగిన రేట్లు.. ఒక్క రోజుకి లక్షల్లోనే..!

ప్రస్తుతం యావత్ దేశం చర్చించుకుంటున్న అంశం అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం. జనవరి 22న జరగనున్న ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీరాముడిని దర్శించుకునేందుకు లక్షల మంది అయోధ్యకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 5 లక్షల మందికిపైగా రామ భక్తులు అయోధ్యకు చేరుకోనున్నారు. ఇప్పటికే హోటల్ బుకింగ్స్ ఫుల్ అయిపోయాటా. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. ఒక్క నైట్ ఉండేందుకు గదుల ధరలు ఏకంగా 500 శాతం మేర పెరిగాయి. లగ్జరీ హోటళ్లలో ఈ రేట్లు రూ.1 లక్ష పైన సైతం ఉన్నట్లు ఇండియా టుడే నివేదించింది.

మేక్ మై ట్రిప్, బూకింగ్.కామ్ వంటి ఆన్‌లైన్ ట్రావెల్ వెబ్‌సైట్స్ లో ఇప్పటికే హోటల్ బుకింగ్స్ ఫుల్ అని చూపిస్తున్నాయి. హోటల్ రూమ్స్ చాలా వేగంగా ఫుల్ అవుతున్నట్లు ఆయా వెబ్‌సైట్లు పేర్కొంటున్నాయి. చాలా తక్కువ రూమ్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో హోటల్ గదుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని హోటళ్లు జనవరి 20 నుంచి జనవరి 22 మధ్య చేసుకునే బుకింగ్స్ క్యాన్సలేషన్ చేసుకునే సౌకర్యాన్ని తొలగించాయి కూడా. అయోధ్యలోని ప్రముఖ హోటల్ ఇన్ రాడిసన్ లో రూముల ధరలు మండిపోతున్నాయి. ఒక రాత్రి ఉండేందుకు రూ.1 లక్షకుపైగా వసూలు చేస్తున్నట్లు ఇండియా టుడే పేర్కొంది. అలాగే రామాయణ్ హోటల్ లో రూముల ధరలు ప్రాణ ప్రతిష్ట రోజు రూ. 40 వేల వరకు ఉన్నట్లు తెలిపింది.


ఈ ఏడాది హోటల్ బుకింగ్స్‌లో 5 రెట్లు పెరిగినట్లు మేక్ మై ట్రిప్ సీఈఓ రాజేశ్ మాగో తెలిపారు. దేశంలోని టాప్ 10 ఆధ్యాత్మిక ప్రాంతాల్లో అయోధ్య ముందు వరుసలో ఉన్నట్లు చెప్పారు. మరోవైపు.. అయోధ్య రామ మందిర ప్రారంభం, శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఆ రోజున హోటళ్లన్నీ పూర్తిగా నిడిపోయినట్లు ఈజీ మై ట్రిప్ పేర్కొంది. ఆక్యుపెన్సీ రేటు 80 శాతం నుంచి 100 శాతంగా ఉందని, దీంతో ధరలు భారీగా పెరిగినట్లు తెలిపింది.

దాదాపు రూమ్స్ అన్ని బుకింగ్ అయ్యయాని, ధరలు సైతం పెరిగినట్లు అయోధ్య సిగ్నెట్ కలెక్షన్స్ హోటల్స్ పేర్కొంది. ఒక్కో గదికి దాదాపు రూ. 70 వేల వరకు ఉన్నట్లు తెలిపింది. మరోవైపు.. పర్యాటకుల సంఖ్యలో గోవా, నైనిటాల్‌ని దాటేసింది అయోధ్య. ఆధ్యాత్మిక ప్రాంతాలు ప్రస్తుతం పర్యటకుల ఇష్టమైన గమ్యస్థానాలుగా ఉన్నాయి. ఓయో యాప్స్ బుకింగ్స్ లో అయోధ్యలో 70 శాతం పెరగగా గోవాలో 50 శాతం మాత్రమే వృద్ధి కనిపిస్తోంది. నైనిటాల్ లో ఓయో బుకింగ్స్ వృద్ధి 60 శాతంగా ఉన్నట్లు ఓయో వ్యవస్థాపకులు రితేశ్ అగర్వాల్ కొద్ది రోజుల క్రితం తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో ఆధ్యాత్మిక టూరిజం అనేది అతిపెద్దదిగా మారనుందని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story