Ujjain: అత్యాచార నిందితుడి ఇల్లు కూల్చివేత

Ujjain: అత్యాచార  నిందితుడి ఇల్లు కూల్చివేత
బుల్‌డోజర్‌తో ధ్వంసం చేసిన అధికారులు

ఉజ్జయిని మైనర్ బాలికపై అత్యాచర ఘటన నిందితుడి ఇంటిని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుల్‌డోజర్‌తో కూల్చేశారు. అది ప్రభుత్వ స్థలమని, అక్రమ నిర్మాణమని అందుకే తొలగించామని ప్రకటించారు. నివేదికల ప్రకారం ఉజ్జయినిలోని నంఖేడా ప్రాంతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్థలంలో నిర్మించిన ఇంటిని అధికారులు బుధవారం సంపూర్ణంగా నేలమట్టం చేశారు. అక్రమంగా ఇల్లు నిర్మించారని అలాంటప్పుడు నోటీసులతో పని లేదని స్పష్టం చేసారు.


మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచర ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అత్యాచారానికి గురైన ఆ బాలిక రక్తమోడుతూ, అర్ధనగ్నంగా వీధుల్లో తిరిగిన దృశ్యాలు వెలుగులోకి రావడం అలజడి రేపింది. 2 గంటలపాటు సుమారు 8 కిలో మీటర్లు తిరిగినా ఆ చిన్నారి దీన స్థితిని స్థానికులు పట్టించుకోకుండా ఛీత్కరించుకోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. చివరికి ఓ ఆలయ పూజారి ఆ బాలికకు బట్టలు ఇచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. తక్షణమే స్పందించిన పోలీస్ యంత్రాంగం బాలికను ఆసుపత్రికి తరలించడంతో పాటు నిందితుడి కోసం గాలించడం మొదలు పెట్టారు. వందలమందిని విచారించి, 700 కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించారు. తర్వాత ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న భారత్ సోనిని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. అతడ్ని విచారణ చేస్తూ ఆధారాల సేకరణ కోసం ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. అయితే అతడు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు వెంటనే స్పందించి అతడ్ని నిర్బంధించారు.


ఈ దారుణంపై స్పందించిన నిందితుడు భరత్ సోనీ తండ్రి రాజు సోనీ ఈ ఘాతుకానికి పాల్పడిన తన కుమారుడిని కాల్చి చంపాలని లేదా ఉరి తీయాలని పోలీసులను కోరాడు. అంత పెద్ద తప్పు చేసినప్పటికీ తన కొడుకులో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదన్నాడు. తన కొడుకుని చూడటానికి తానూ ఆసుపత్రికి కూడా వెళ్లానని స్పష్టం చేశారు. తన కొడుకు నేరం చేసాడు, కాబట్టి అతన్ని ఉరితీయాలి అన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, నిందితులను చట్టపరంగా పూర్తి స్థాయిలో విచారిస్తామని ప్రతిజ్ఞ చేశారు.


Tags

Read MoreRead Less
Next Story