BSF jawan: కళ్లకు గంతలు కట్టి, రహస్యాలు అడిగి: పాక్ చెరలో బీఎస్‌ఎఫ్ జవాన్‌కు వేధింపులు

BSF jawan: కళ్లకు గంతలు కట్టి,  రహస్యాలు అడిగి: పాక్ చెరలో బీఎస్‌ఎఫ్ జవాన్‌కు వేధింపులు
X
భారత జవాన్‌ను చిత్రహింసలకు గురిచేసిన పాక్‌

పాక్‌ రేంజర్ల నిర్బంధంలో గత 21 రోజులుగా ఉన్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) జవాన్‌ పూర్ణమ్‌ కుమార్‌ షా విడుదలైన సంగతి తెలిసిందే. పాక్‌ (Pakistan) అదుపులో ఉన్నప్పుడు ఆయనను నిద్ర పోనివ్వలేదని, దూషించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

నిర్బంధంలో ఉన్నన్ని రోజులు పాక్‌ అధికారులు పూర్ణమ్‌ను మూడు ప్రాంతాల్లో తిప్పి ఒక లొకేషన్‌లో జైలు సెల్‌లో ఉంచారు. వారివద్ద ఉన్నన్ని రోజులు చాలావరకు కళ్లకు గంతలు కట్టే ఉంచారని సమాచారం. ఆయనను శారీరకంగా హింసకు గురిచేయలేదు కానీ.. మాటలతో మాత్రం వేధింపులకు గురిచేశారని ఆ వర్గాలు వెల్లడించాయి. కనీసం నిద్ర పోనివ్వలేదని, బ్రష్ చేసుకోవ్వలేదని తెలిపాయి. అలాగే సరిహద్దులో మోహరింపు గురించి, అక్కడ ఉండే సీనియర్ అధికారుల గురించి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారని పేర్కొన్నాయి. కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలని ఆ అధికారులు ఒత్తిడి చేశారని తెలుస్తోంది. అయితే బీఎస్‌ఎఫ్ నిబంధనల ప్రకారం ఆయన వద్ద ఎలాంటి ఫోన్ లేకపోవడంతో వారికి వివరాలు అందలేదు. ఇక ఈ ప్రశ్నలన్నీ అడిగిన అధికారులు సివిల్ దుస్తుల్లో ఉన్నారట.

పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రైతులకు రక్షణగా గత నెల 23న గస్తీ నిర్వహిస్తున్న సమయంలో పూర్ణమ్‌ అస్వస్థతకు గురయ్యారు. సమీపంలో ఓ చెట్టు కనబడటంతో దానికింద విశ్రాంతి తీసుకున్నారు. అది పాక్‌ భూభాగం అన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. పాకిస్థాన్‌ రేంజర్స్‌ ఆయనను నిర్బంధంలోకి తీసుకున్నారు. జవాన్‌ విడుదల కోసం రెండు దేశాల భద్రతా దళాలు ఆరు సార్లు చర్చలు జరిపాయి. మరోవైపు పూర్ణమ్‌ కుటుంబసభ్యులు తీవ్రంగా ఆందోళన చెందారు.

గర్భిణి అయిన ఆయన భార్య.. భర్త విడుదల కోసం కేంద్రాన్ని వేడుకున్నారు. కొన్నాళ్లపాటు భారత్‌ అధికారుల అభ్యర్థనలు పట్టించుకోకుండా పాక్‌ రేంజర్లు కాలయాపన చేశారు. అయితే ఈనెల మొదటివారంలో రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ సమీపంలో మన భూభాగంలోకి ప్రవేశించిన పాక్‌ రేంజర్‌ మహమ్మదుల్లాను బీఎస్‌ఎఫ్‌ అదుపులోకి తీసుకుంది. దీంతో పాకిస్థాన్‌ పైనా ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే పూర్ణమ్‌ను విడుదల చేసింది. బీఎస్‌ఎఫ్‌ కూడా పాక్‌ రేంజర్‌ను అప్పగించింది.

Tags

Next Story