Assam Vs Bengal CM’S: బెంగాల్ తగలబడితే.. అంటూ మమత చేసిన వాఖ్యలపై అస్సాం సీఎం ఫైర్

‘బెంగాల్ తగలబడితే, తర్వాత అస్సాం, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ కూడా తగలబడతాయి అనే విషయం గుర్తుంచుకోండి’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో తాజా ఘటనలను ఉద్దేశించి బుధవారం కోల్‌కతాలో తృణమూల్ విద్యార్థి విభాగం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
బుధవారం కోల్‌కతాలో జరిగిన తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మంగళవారం జరిగిన అల్లర్లపై మమత ప్రస్తావించారు. రాష్ట్ర సచివాలయానికి నబన్న అభిజన్ నిరసన మార్చ్ సందర్భంగా జరిగిన హింస జరిగింది. ఆ హింసా ఘటనలు బీజేపీ నేతృత్వంలోనే జరిగాయి. దీనికి తోడు ఆర్‌జీ కార్ ఘటనపై వెల్లువెత్తుతున్న విమర్శలు.. వెరసీ బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం తరహాలో తమ ప్రభుత్వం పతనానికి అల్లర్లు జరుగుతున్నాయని అర్ధం వచ్చేలా పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘‘మోడీ జీ.. మీ ప్రజల ద్వారా మా రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు మా రాష్ట్రాన్ని తగులబెడితే అస్సాం, ఈశాన్యం, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ కూడా తగులబడతాయని గుర్తుంచుకోండి’ అని ఆమె అన్నారు.
మమత వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా స్పందించారు. ‘దీదీ, అస్సాంను బెదిరించేందుకు ఎంత ధైర్యం? మాపై కళ్లు ఎర్రవి చేసి చూడకండి. మీ విఫల రాజకీయాలతో దేశాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించకండి’ అంటూ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి మమతా బెనర్జీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు సుకాంత మజందార్ లేఖ రాశారు. ‘నేను ఎప్పుడూ ప్రతీకారాన్ని కోరుకోలేదు. కానీ ఇప్పుడు ఏది అవసరమైతే అది చేయండి’ అని అమిత్ షాను కోరారు.
విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా బీజేపీ పిలుపునిచ్చిన 12 గంటల బెంగాల్ బంద్ బుధవారం ఉద్రిక్తతలతో ముగిసింది. దుకాణాలు, రోడ్లను మూసేందుకు ప్రయత్నించిన బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పలు రైల్వే స్టేషన్లలో బీజేపీ కార్యకర్తలు రైళ్లను అడ్డుకున్నారు. అక్కడక్కడ బీజేపీ కార్యకర్తలు, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మాజీ ఎంపీలు రూపా గంగూలీ, లాకెట్ ఛటర్జీ, రాజ్యసభ ఎంపీ సామిక్ భట్టాచార్య తదితర బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com