Bomb Threats: ఎన్నికల వేళ దేశంలోని ప్రముఖ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు

అణువణువు సోదాలు, అంతా బూటకమే అని తెచ్చిన అధికారులు

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ మరోసారి బాంబు బెదిరింపు ఈ మెయిళ్లు కలకలం రేపాయి. దేశవ్యాప్తంగా 13 ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మానాశ్రయాలను పేల్చివేస్తామని బెదిరిస్తూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్)కి ఆదివారం ఈ-మెయిల్ వచ్చింది. మధ్యాహ్నం 3.05 గంటలకు సీఐఎస్ఎఫ్ కార్యాలయానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎయిర్ పోర్టుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే అనుమానాస్పదంగా ఏం కనిపించకపోవడంతో ఇది బూటకపు బెదిరింపులుగా తేల్చారు. లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం, భోపాల్, పాట్నా, జమ్మూ, జైపూర్ విమానాశ్రయాలకు బెదిరింపుల రావడం కలకలం రేపింది. అయితే బాంబు బెదిరింపు అంచనా కమిటీ బెదిరింపు ‘నాన్-స్పెసిఫిక్’ అని ప్రకటించింది.

తనిఖీలు, స్క్రీనింగ్‌తో పాటు ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి లక్నో విమానాశ్రయంలో అదనపు చర్యల్ని తీసుకున్నారు. మరోవైపు ఈ రోజు తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI) మరియు 10కి పైగా ఆసుపత్రులకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులు బూటకమని తేలింది. ఈమెయిళ్లు పంపిన దుండగులను గుర్తించేందుకు అధికారులు విచారణ చేపట్టారు. ఢిల్లీ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.బెదిరింపు మెయిల్స్‌ వచ్చిన నేపథ్యంలో దేశంలోని ఇతర విమానాశ్రయాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రయాణికులు, సిబ్బందితోపాటు ఎయిర్‌పోర్టుల్లోకి వచ్చే ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు.. ఈ బాంబు మెయిల్ ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఈ-మెయిల్‌ పంపించిన వారిని పట్టుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు.

ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని 100కు పైగా పాఠశాలలకు ఇదే విధంగా బెదిరింపులు వచ్చాయి. అయితే, ఈమెయిళ్లు రష్యాకు చెందిన ఐపీ అడ్రస్ నుంచి వచ్చినట్లు అధికారులు తేల్చారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌కి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల వేళ ఇలా బూటకపు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. అయితే, వీటి వెనక ఉగ్రవాదుల హస్తం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. Bomb Threat Bomb threat To airports Lok Sabha elections-2024 Threat e-mail

Tags

Next Story