Kerala News: కేరళలో విరిగిపడిన కొండచరియలు..

ఏడుగురి మృతి! శిథిలాల కింద వందలాది మంది

కేరళలోని వయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాలలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో కనీసం ఏడుగురు మృతిచెందినట్లు సమాచారం! వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.

కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం , అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వయనాడ్‌కు చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కొండచరియల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది.

మెప్పాడి ముండకైలో ప్రాంతంలో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక్కడ వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. చురల్మల పట్టణంలో కొంత భాగం తుడిచిపెట్టుకుపోయినట్లు సమాచారం. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వెల్లర్మల పాఠశాల పూర్తిగా నీట మునిగింది. మెప్పాడి ముండకై ప్రాంతంలో ఇంత పెద్ద విపత్తును వయనాడ్ ఎన్నడూ చూడలేదని స్థానికులు తెలిపారు.

ముండకైలో అర్ధరాత్రి ఒంటిగంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగిపడ్డట్లు స్థానికులు వెల్లడించారు. 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం ఉన్నట్లు తెలిపారు. చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. విపత్తుపై ఇంకా కచ్చితమైన అంచనాకు రాలేదని అధికారులు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని రెవెన్యూ మంత్రి కె.రాజన్ చెప్పారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్‌ను వినియోగిస్తున్నారు. 16 మందికి మెప్పాడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వంతెన కూలిపోవటంతో అత్తమల, చురల్‌మలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు, ఇతరత్రా యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. వయనాడ్ జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తొండర్‌నాడ్ గ్రామంలో నివసిస్తున్న నేపాలీ కుటుంబానికి చెందిన ఒక చిన్నారి ఈ ప్రమాదంలో మరణించింది. ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించింది. అత్యవసర సహాయం కోసం 9656938689, 8086010833 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపింది.

Tags

Next Story