Gold smuggling : బంగారం అక్రమ రవాణా ఈసారి పేస్టు రూపంలో

అక్రమంగా దుబాయ్ నుంచి తరలిస్తున్న సుమారు రూ. 27 కోట్లు విలువైన బంగారాన్ని పట్టుకున్నారు డైరక్టరెట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజన్స్ అధికారులు. బంగారం తరలింపు సమాచారంతో తనిఖీలు చేపట్టిన అధికారులు షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే ఈ సారి బంగారం సరికొత్త స్టైల్ లో పేస్ట్ రూపంలోకి మార్చి, హ్యాండ్ బాగుల్లో అక్రమంగా తరలిస్తున్నారు.
దుబాయ్- షార్జా నుంచి వస్తున్న విమానంలో అక్రమ బంగారాన్ని తరలిస్తున్నారనే సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన డీఆర్ఐ అధికారులు. వెంటనే సూరత్ విమానాశ్రయం చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే హ్యాండ్ బ్యాగ్‌లో తనిఖీ చేయగా ఓ పేస్ట్ లాంటి పదార్ధం కనిపించింది. ఆ పేస్ట్ మరేదో కాదని అధికారులకు అర్థం అయింది. ఒకటీ కాదు.. రెండూ కాదు.. ఏకంగా 48.20 కిలోల బంగారం. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే నలుగురిని శనివారం అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం అరెస్ట్ చేసి డీఆర్ఐ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టారు.ఈ బంగారం విలువ సుమారు రూ. 27 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. వీరిని సూరత్‌లోని రాందేర్కు చెందిన వారిగా గుర్తించారు. ఇప్పటివరకు పట్టుకున్న వాటిలో ఇదే అతిపెద్దదని అధికారులు చెప్పారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో ముగ్గురు ప్రయాణికులతో పాటు ఒక అధికారి కూడా ఉన్నారు.
ఈ అక్రమ రవాణాకు ఎయిర్‌పోర్టులోని అధికారులు కూడా సహకరించారని భావిస్తున్నారు. స్క్రీనింగ్ , తనిఖీలను నివారించడానికి ఇమ్మిగ్రేషన్‌కు ముందు ఉన్న టాయిలెట్‌లో దేనిని చేతులు మార్చడానికి ప్రయత్నిస్తున్నట్టు డీఆర్ఐ తెలిపింది. బ్యాగులోని ఐదు బెల్టుల్లో 20 తెలుపు రంగు పాకెట్లలో పెట్టి బంగారం తీసుకువచ్చారు. నిందితులందరి వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేశారు. కేసు విచారణ కొనసాగుతోంది. సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ స్మగ్లింగ్ రాకెట్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అచ్చం ఇలాంటి ఘటనే శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల జరిగింది. పేస్ట్ రూపంలో తరలిస్తున్న అక్రమ బంగారాన్ని ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళలను నిఘా విభాగం అధికారులు తనిఖీ చేశారు. వారు పేస్ట్ రూపంలో బంగారు క్యాప్స్యూల్స్ తీసుకొస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారి నుంచి అధికారులు బంగారం క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com