Mystery : శివపురి అడవిలో వందలాది ఆవుల మృతదేహాలు..

Mystery : శివపురి అడవిలో వందలాది ఆవుల మృతదేహాలు..
X
మధ్యప్రదేశ్‌లోని శివపురిలో వెలుగుచూసిన ఘటన

మధ్య ప్రదేశ్‌లోని సిల్లెర్‌పూర్‌ గ్రామం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో దాదాపు 500 ఆవుల మృతదేహాలు కనిపించాయి. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయో తెలియడం లేదు. వీటిని పట్టణ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి, ఇక్కడ పడేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. సిల్లెర్‌పూర్‌ గ్రామ సర్పంచ్‌ మాట్లాడుతూ, తాను అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్‌ వడిల్‌ మాట్లాడుతూ, ఈ అటవీ ప్రాంతం ఆవుల మృతదేహాల డంపింగ్‌ యార్డుగా మారిపోయిందన్నారు. కరైనా పురపాలక సంఘం ప్రాంతం నుంచి వీటిని తీసుకొచ్చి, ఇక్కడ పడేస్తున్నారన్నారు.

శివపురి-ఝాన్సీ జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో సిల్లియర్‌పూర్ గ్రామం అడవిలో కనీసం 400 నుంచి 500 కళేబరాలు పడి ఉన్నాయి. వీటిలో కొన్ని ఆవులు సజీవంగా కనిపించడంతో ఈ దృశ్యం స్థానిక గ్రామస్తులను ఆశ్చర్యపరిచింది.రాత్రిపూట సమీపంలోని పట్టణాల నుంచి కొందరు తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్టు గ్రామస్థులు భావిస్తున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆ గ్రామ ప్రధాన్‌ అరవింద్ లోధీ ఆరోపించారు. వీటిని ఇక్కడే ఎందుకు పడేస్తున్నారో కారణం తెలియదని ఆయన పేర్కొన్నారు. తీవ్రమైన చలి కారణంగా ఆ ఆవులన్నీ చనిపోయి ఉండవచ్చని కేరారా పోలీసులు తెలిపారు. చనిపోయిన జంతువులను సల్లియపూర్‌ గ్రామం అడవి వద్ద పడేస్తుంటామని మున్సిపాలిటీ కార్మికులు కూడా చెప్పినట్టు ఆయన వివరించారు. అటవీ ప్రాంతంలో ఇంత భారీ స్థాయిలో పశువుల శవాలు లభ్యమవడం, వాటి మరణానికి కారణం తెలియకపోవడం ఇదే తొలిసారి. వాటిపై ఏ క్రూర జంతువైనా దాడి చేసిందా ? లేక వాటిపై విష ప్రయోగం జరిగిందా ఇంకా తెలియరావడం లేదు. ఆ ఆవుల యజమానులు ఎవరు ? ఇంత కాలం ఆవులు కనిపించకుండా పోయినా వారు ఎందుకు వెతకలేదు అనే విషయంపై ఇంకా స్పష్టత రావడం లేదు.

కాగా, చనిపోయిన ఆవుల కడుపులో నుంచి పాలిథిన్‌ బ్యాగ్స్ వచ్చినట్లు సిల్లార్‌ పుర పంచాయతీ సర్పంచ్‌ తెలిపారు. ప్లాస్టిక్ తినడం వల్లే ఆవులు చనిపోయాయని చెప్పారు. చనిపోయిన తర్వాత పట్టణ ప్రాంతం నుంచి లారీల్లో తీసుకుని వచ్చి ఇక్కడ పడేసినట్లు తెలుస్తోంది. వాస్తవం ఏమైనప్పటికీ ఈ సంఘటన శివపురిలోనే కాకుండా మొత్తం రాష్ట్రాన్ని భయాందోళనకు గురి చేసింది.

Next Story