SRH: తన రికార్డు తానే బ్రేక్ చేసిన సన్ రైజర్స్

సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డును మరోసారి బద్దలు కొట్టింది. గతంలో ఐపీఎల్ హయ్యస్ట్ స్కోరు 263 పరుగులు ఉండగా, ఇటీవలే 277 పరుగులు చేసి ఆ రికార్డును బద్దలు కొట్టిన సన్ రైజర్స్... ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 287 పరుగులు చేసి తన రికార్డును తానే అధిగమించింది.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగుల అతి భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీ హైలైట్ గా నిలుస్తుంది. హెడ్ 41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగులు చేయడం విశేషం.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు అదిరే ఆరంభం దక్కింది. ఓపెనర్లు ట్రానిస్ హెడ్-అభిషేక్ శర్మ కేవలం ఎనిమిది ఓవర్లలోనే వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పటిష్టమైన పునాది వేశారు. రీస్ టాప్లీ వేసిన రెండో ఓవర్‌లో 20 పరుగులు రాబట్టారు. ఫెర్గూసన్ వేసిన ఐదో ఓవర్‌లో ట్రావిస్ హెడ్ వరుసగా రెండు సిక్సర్లు, ఒక ఫోర్ సాధించి స్కోరు బోర్డులో వేగాన్ని పెంచాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన యశ్ దయాల్ వేసిన ఆరో ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఓ బౌండరీ బాదిన హెడ్.... 20 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ట్రానిస్ హెడ్ ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. ఓపెనర్ల దూకుడుతో పవర్ ప్లే ముగిసేసరికి హైదరాబాద్ 76 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. వీల్ జాక్స్ వేసిన ఏడో ఓవర్‌లోనూ ట్రానిస్ హెడ్ విధ్వంసం సృష్టించాడు. వరుసగా 4,6,6 బాదేశాడు. దీంతో ఏడు ఓవర్లకే స్కోరు 97 పరుగులకు చేరింది. హైదరాబాద్ స్కోరు 8 ఓవర్లకే 100 దాటేసింది. విజయ్‌కుమార్ వేసిన ఎనిమిదో ఓవర్‌లో తొలి బంతికి అభిషేక్ శర్మ సిక్సర్ బాదాడు. అనంతరం భారీ షాట్ ఆడి అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి హైదరాబాద్ స్కోరు 128/1. బెంగళూరు బౌలర్లను ఊచకోత కోసిన ట్రావిస్ హెడ్.. 39 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో హెడ్ 102పరుగులు చేశాడు. శతకం పూర్తి చేసుకున్న ట్రావిస్ హెడ్‌ను ఫెర్గూసన్ అవుట్ చేశాడు. 13 ఓవర్‌లో మూడో బంతికి భారీ షాట్ ఆడి మిడాఫ్‌లో హెడ్... డుప్లెసిస్‌కు చిక్కాడు. 13 ఓవర్లకు స్కోరు 171/2. అనంతరం క్లాసెన్ విధ్వంసం ఆరంభించాడు. కేవలం 31 బంతుల్లో 2 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ కేవలం 23 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అనంతరం క్లాసెన్‌ను ఫెర్గూసన్ అవుట్ చేశాడు. తర్వాత మార్క్‌క్రమ్ కూడా ధాటిగా ఆడడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోరు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com