Doctor dead: ఈత కొట్టేందుకు నదిలోకి దూకి ప్రాణాలు కోల్పోయిన వైద్యురాలు

Doctor dead: ఈత కొట్టేందుకు నదిలోకి దూకి ప్రాణాలు కోల్పోయిన వైద్యురాలు
X
విషాదాంతమైన విహారయాత్ర..

విహారయాత్ర విషాదాంతమైంది. ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా టూర్‌కు వెళ్లిన ఓ యువ వైద్యురాలు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం కొప్పల్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ అనన్య మోహన్‌ రావు తన ఫ్రెండ్స్‌తో కలిసి కర్ణాటక రాష్ట్రానికి విహారయాత్రకు వెళ్లింది. అక్కడ అంతా సుందరమైన ప్రదేశాలను సందర్శించారు. మంగళవారం రాత్రి సణాపుర గ్రామంలోని ఓ అతిథి గృహంలో బస చేశారు. బుధవారం మధ్యాహ్నం వారంతా తుంగభద్ర నది (Tungabhadra river) వద్దకు వెళ్లారు. అక్కడ ఈత కొట్టేందుకు అనన్యరావు నదిలోకి దిగింది. 25 అడుగుల ఎత్తైన బండరాయి నుంచి అనన్యరావు నీటిలోకి దూకి ఈత కొట్టేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో ఈత కొడుతూ నీటి ఉద్ధృతికి నదిలో కొట్టుకుపోయింది. అక్కడే ఉన్న ఆమె స్నేహితులు అనన్యను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. వెంటనే వారు పోలీసులకు, స్థానిక అధికారులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. గజ ఈతగాళ్లు, అగ్నిమాపకదళం సాయంతో యువతి కోసం నదిలో సాయంత్రం వరకూ తీవ్రంగా గాలింపు చేపట్టారు. అయినా ఆమె జాడ కానరాలేదు. తాజాగా గురువారం ఉదయం అనన్యరావు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలు వీకేసీ ఆసుపత్రిలో వైద్యురాలు అని తెలిసింది. ఆమె నదిలోకి దూకుతున్న వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Tags

Next Story