Vasundhara Raje: కుమారుడి స్పీచ్‌కు మురిసిపోయిన వసుంధర రాజే

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఇక రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనిపిస్తోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 25వ తేదీన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంటే.. ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కమలం పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. రెండు పార్టీలూ ముమ్మరంగా ప్రచారం చేస్తూ విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్రంలో ఎన్నికల హీట్ పుట్టిస్తున్నాయి.
ఇక వసుంధరా రాజే మరోమారు ఝలావర్‌నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కుమారుడు దుష్యంత్ సింగ్ రాజే ప్రసంగం విని మురిసిపోయారు. ఇక తాను నిశ్చింతగా రిటైర్ అవ్వొచ్చని వ్యాఖ్యానించారు. దుష్యంత సింగ్ ప్రజాప్రతినిధిగా ప్రజల మన్ననలు పొందుతున్న తీరుపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.
‘నా కుమారుడు మాట్లాడింది విన్నాక నేను ఇక నిశ్చింతగా రిటైర్ అవ్వొచ్చని అనిపించింది. మీరందరూ అతడికి మంచి తర్ఫీదు ఇచ్చారు. ఇక అతడికి నేను దిశానిర్దేశం చేయాల్సిన అవసరం లేదనిపిస్తోంది. ఎమ్మెల్యేలందరూ ఇక్కడే ఉన్నారు. వారిపై పర్యవేక్షణ అవసరం లేకుండానే ప్రజల కోసం కష్టించి పనిచేస్తున్నారు’’ అని రాజే వ్యాఖ్యానించారు.
ఝలావర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్న రాజే నవంబర్ 25న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఝలావర్-బరన్ లోక్‌సభ నియోజకవర్గానికి దుష్యంత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. నవంబర్ 25న ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్లతోపాటు రాజస్థాన్ ఓట్లను కూడా లెక్కించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com