Vayu Shakti 2024: ఎడారిలో 120 విమానాలు, ఎన్నెన్నో డ్రోన్లు, మిస్సైళ్లు..

వాయుశక్తి పేరిట రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో భారత వైమానిక దళం నిర్వహించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. ఈ డ్రిల్స్‌లో 120కిపైగా యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, క్షిపణులు పాల్గొని లక్ష్యాలపై బాంబులతో విరుచుకుపడ్డాయి. M-777 శతఘ్నులను వాయు మార్గంలో తరలించిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. శనివారం డే అండ్ నైట్ విధానంలో నిర్వహించిన ఈ డ్రిల్స్‌లో గరుడ కమాండోలు ప్రత్యేక ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో.... వాయు శక్తి పేరిట భారత వాయుసేన-IAF నిర్వహించిన విన్యాసాలు...ఆకట్టుకున్నాయి . పాకిస్థాన్ సరహద్దుకు సమీపంలోని పొఖ్రాన్‌లో నిర్వహించిన ఈ డ్రిల్స్‌లో IAF తనశక్తి సామర్థ్యాలను ప్రదర్శించింది. ఈ డ్రిల్స్‌లో 120కిపైగా యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, క్షిపణులు పాల్గొన్నాయి. ఇందులో రఫేల్, సుఖోయ్, మిగ్-29, మిరాజ్-2000 యుద్ధ విమానాలు చేసిన ప్రదర్శనలు కట్టిపడేశాయి. శత్రు లక్ష్యాలపై అవి కచ్చితత్వంతో బాంబు దాడులు చేశాయి.
C-17 ఎయిర్ క్రాఫ్ట్ ఆకాశం నుంచి బాంబులను పారాచూట్ల ద్వారా నేలపైకి విజయవంతంగా జారవిడిచింది. కొన్ని నిమిషాల్లోనే అవి నిర్దేశిత లక్ష్యాలపై పడి భారీ పేలుళ్లు సంభవించాయి. దేశీయంగా తయారు చేసిన తేజస్ వంటి హెలికాప్టర్లు..తమ యుద్ధ పాటవాలను ప్రదర్శించాయి.
C-130J యుద్ధ విమానాల ద్వారా శత్రు స్థావరాల వద్దకు గరుడ కమాండోలు చేరుకుని నిర్వహించిన ఆపరేషన్ కట్టిపడేసింది. కొన్ని ప్రత్యేక దళాలు నిర్వహించిన స్లిథరింగ్ డ్రిల్స్ ఆకట్టుకున్నాయి. వాయుశక్తి విన్యాసాల్లో భాగంగా రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రెండు గంటల స్వల్ప వ్యవధిలో సుమారు 50 టన్నుల ఆయుధాలను IAF జారవిడిచింది. చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఈ విన్యాసాలను పర్యవేక్షించారు. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో కొనసాగుతున్న సరిహద్దు వివాదం నేపథ్యంలో ఈ మెగా డ్రిల్స్‌ను వాయుసేన నిర్వహించింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com