Bengaluru: ఐఏఎస్‌ ఆఫీసర్ రోహిణి సింధూరి‌‌పై ఫిర్యాదు

Bengaluru: ఐఏఎస్‌ ఆఫీసర్ రోహిణి సింధూరి‌‌పై  ఫిర్యాదు
X
భూమిని ఆక్రమించారని బాలీవుడ్‌ సింగర్ లక్కీ అలీ ఫిర్యాదు

కర్ణాటక క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరి తన భూమిని ఆక్రమించారంటూ ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు లక్కీ అలీ కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. యెలహంకలోని తన వ్యవసాయ భూమిని సింధూరి, ఆమె భర్త సుధీర్‌ రెడ్డి, బంధువు మధుసూధన్‌ రెడ్డి ఆక్రమించుకున్నారని ఆరోపించారు. దీనిపై 2022లోనే తాను ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో లోకాయుక్తను ఆశ్రయించినట్టు చెప్పారు.

బెంగళూరు శివారులోని యెలహంక ప్రాంతంలో తన వ్యవసాయ భూమిని ఐఏఎస్‌ ఆఫీసర్ రోహిణి, ఆమె భర్త సుధీర్‌ రెడ్డి, బంధువు మధుసూదన్‌ రెడ్డి అక్రమంగా లాక్కొన్నారని లక్కీ అలీ ఆరోపించారు. ఇందుకు కొందరు స్థానిక పోలీసు అధికారులు ఆమెకు సాయం చేసినట్లు తెలిపారు. 2022లోనే దీనిపై తాను కేసు పెట్టినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందుకే తాను లోకాయుక్త పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. గాయకుడి ఫిర్యాదుతో యెలహంక న్యూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉంటే గతేడాది ఐపీఎస్‌ రూపా మౌద్గిల్‌తో వివాదంతో ఐఏఎస్‌ రోహిణి సింధూరి వార్తల్లో నిలిచారు. రోహిణి వ్యక్తిగత చిత్రాలను బయటపెడుతూ ఐపీఎస్‌ రూప చేసిన ఆరోపణలు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రూప ఆరోపణలకు రోహిణి కూడా సోషల్‌ మీడియాలో దీటుగా స్పందించారు. తనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేసి, సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టిన రూప తనకు క్షమాపణలు చెప్పాలని.. రూ.కోటి ఇవ్వాలని రోహిణి డిమాండ్‌ చేశారు. ఈ కేసును విచారిస్తున్న బెంగళూరు కోర్టు మార్చి 24న రూపపై క్రిమినల్ పరువునష్టం కేసును ప్రారంభించింది. అనంతరం కేసును రద్దు చేయాలని మౌద్గిల్ హైకోర్టును కోరింది. ఆగస్టు 21న ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. ఆ తర్వాత ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఈ వ్యవహారం కాస్త తీవ్ర దుమారం రేపడంతో అప్పటి ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకుంది. వీరిద్దరికీ ఎలాంటి పోస్టులు కేటాయించకుండా బదిలీ వేటు వేసింది.

Tags

Next Story