ICICI Bank: ఐసీఐసీఐ మీనిమం బ్యాలెన్స్ ఇక నుంచి 50 వేలు

ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ తన సేవింగ్స్ ఖాతాల కనీస సగటు బ్యాలన్స్ నిబంధనల్లో భారీ పెంపు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ మార్పు మెట్రో, అర్బన్, సెమీ-అర్బన్, గ్రామీణ బ్రాంచ్‌ల ఖాతాదారులందరిపై ప్రభావం చూపనుంది. ఈ పెంపుతో దేశీయ బ్యాంకులలో అత్యధిక ‘కనీస సగటు బ్యాలన్స్’ ఐసీఐసీఐ బ్యాంక్‌దే అవుతోంది. కొత్తగా సవరించిన నిబంధనల ప్రకారం.. మెట్రో, అర్బన్ ప్రాంతాల ఖాతాదారులు సగటున 50,000 కనీస నిల్వ ఉంచాలి. ఇది ఇంతకుముందు ఉన్న 10,000 నుంచి 50,000 కు పెరగడంతో.. ఐదు రెట్లు పెరిగినట్టే. సెమీ-అర్బన్ బ్రాంచ్‌లలో కనీస బ్యాలెన్స్ 5,000 నుంచి 25,000కు పెరిగింది. అలాగే గ్రామీణ బ్రాంచ్‌లలో మాత్రం 2,500 నుంచి 10,000కు పెంచారు.
ఇకపోతే, దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను పూర్తిగా రద్దు చేసింది. ఇతర బ్యాంకులు సాధారణంగా 2,000 నుంచి 10,000 వరకు మాత్రమే MAB ఉంచేలా నిబంధనలు అమలు చేస్తుంటాయి. ఉదాహరణకు, ఇటీవల HDFC లిమిటెడ్‌తో విలీనం తరువాత ఆస్తుల పరంగా అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు మారిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ MABను మెట్రో, అర్బన్‌లో 10,000, సెమీ-అర్బన్‌లో 5,000, గ్రామీణ బ్రాంచ్‌లలో 2,500గా ఉంచింది. బ్యాంకులు తమ రోజువారీ కార్యకలాపాలు, పెట్టుబడుల ఖర్చులను తీర్చుకునేందుకు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలను అమలు చేస్తాయి. ఈ పరిమితి కంటే తక్కువ నిల్వ ఉంచిన ఖాతాదారులపై జరిమానాలు కూడా వేస్తుంటాయి. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత సవరించిన ఫీజు చార్ట్ ప్రకారం జరిమానాలు విధించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com