ICICI Bank: కనీస బ్యాలెన్స్ నిబంధనపై వెనక్కి తగ్గిన ఐసీఐసీఐ బ్యాంక్

దేశంలోని రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్, కొత్తగా తెరిచే సేవింగ్స్ ఖాతాలపై కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం కనీస బ్యాలెన్స్‌ను భారీగా పెంచి విమర్శల పాలైన ఈ బ్యాంక్, తాజాగా కస్టమర్ల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో తన నిర్ణయాన్ని మార్చుకుంది. పెంచిన ఛార్జీలను గణనీయంగా తగ్గిస్తూ కొత్త ప్రకటన విడుదల చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం, నగర ప్రాంతాల్లోని కొత్త కస్టమర్లు తమ ఖాతాల్లో నిర్వహించాల్సిన కనీస సగటు బ్యాలెన్స్‌ను రూ. 50,000 నుంచి రూ. 15,000కు తగ్గించారు. వాస్తవానికి, కొన్ని రోజుల క్రితం ఈ పరిమితిని రూ. 10,000 నుంచి ఏకంగా రూ. 50,000కు పెంచడంతో ఖాతాదారుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో బ్యాంక్ యాజమాన్యం దిగివచ్చి ఈ సవరణ చేసింది. అయితే, పాత నిబంధనతో పోలిస్తే ఇది ఇప్పటికీ రూ. 5,000 ఎక్కువగానే ఉంది.
అదేవిధంగా, పట్టణ (సెమీ-అర్బన్) ప్రాంతాల్లోని కొత్త ఖాతాదారులకు కూడా ఊరట కల్పించారు. ఇక్కడ కనీస బ్యాలెన్స్ పరిమితిని రూ. 25,000 నుంచి రూ. 7,500కు తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పాత కస్టమర్ల కనీస బ్యాలెన్స్ నిబంధనలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. వారి ఖాతాల్లో ప్రస్తుతం ఉన్న రూ. 5,000 కనీస బ్యాలెన్స్ నిబంధనే కొనసాగుతుంది.
కాగా, దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) 2020లోనే తమ సేవింగ్స్ ఖాతాలపై కనీస బ్యాలెన్స్ నిబంధనను పూర్తిగా రద్దు చేసింది. ఇతర బ్యాంకులు కూడా సాధారణంగా రూ. 2,000 నుంచి రూ. 10,000 మధ్యలోనే కనీస బ్యాలెన్స్‌ను నిర్ధారించాయి. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ భారీగా బ్యాలెన్స్ పెంచడం తీవ్ర చర్చనీయాంశం కాగా, విమర్శల నేపథ్యంలో వెనక్కి తగ్గడం గమనార్హం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com