Indian Railways : లగేజీకి అదనపు చార్జీ-లోక్‌సభలో వెల్లడించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

రైళ్లలో అవసరానికి మించి లగేజీ తీసుకెళ్లే ప్రయాణికులకు ఇది కీలక సమాచారం. ఇకపై నిర్ణయించిన లగేజీ పరిమితిని మించి సామాను తీసుకెళ్తే తప్పనిసరిగా అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని భారత రైల్వే స్పష్టం చేసింది. విమాన ప్రయాణాల్లో ఉన్నట్లే, రైలు ప్రయాణాల్లో కూడా లగేజీ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
సాధారణంగా చాలా మంది రైలు ప్రయాణాన్ని సౌకర్యవంతమైనదిగా, తక్కువ ఖర్చుతో కూడినదిగా భావిస్తారు. అందుకే ఇతర ప్రయాణ మార్గాల కంటే రైల్వేను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. అయితే, రైళ్లలో అవసరానికి మించి లగేజీ తీసుకెళ్లడం వల్ల భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లగేజీ పరిమితి నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించారు.
ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు. ప్రయాణికులు తమ ప్రయాణ తరగతిని బట్టి ఇప్పటికే నిర్దిష్ట ఉచిత లగేజీ పరిమితి ఉందని తెలిపారు. ఆ పరిమితిని మించి లగేజీ తీసుకెళ్తే తప్పనిసరిగా అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అవసరానికి మించి సామాను తీసుకెళ్లడం రైలు ప్రయాణ భద్రతకు ముప్పుగా మారుతుందని కూడా ఆయన హెచ్చరించారు.
రైల్వే నిబంధనల ప్రకారం, సెకండ్ క్లాస్ ప్రయాణికులు గరిష్టంగా 35 కిలోల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఈ పరిమితిని మించి లగేజీ తీసుకెళ్లాలంటే గరిష్టంగా 70 కిలోల వరకు అనుమతి ఉంటుంది. అయితే, అదనపు బరువుకు సంబంధించి నిర్ణయించిన చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు కొంత వెసులుబాటు ఉంది. వారు ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా 40 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లవచ్చు. అవసరమైతే 80 కిలోల వరకు సామాను తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, ఆ పరిమితిని మించిన బరువుకు మాత్రం అదనపు రుసుము చెల్లించాల్సిందేనని అధికారులు తెలిపారు.
10 గంటల ముందే చార్ట్ తయారీ
రైళ్ల ఫస్ట్ రిజర్వేషన్ చార్ట్‌ను తయారు చేసే సమయాన్ని భారతీయ రైల్వే సవరించింది. దీంతో 10 గంటల ముందు తమ టికెట్ రిజర్వేషన్ అయిందో, లేదో ప్రయాణికులు తెలుసుకోవచ్చు. గతంలో నాలుగు గంటల ముందు తయారు చేయటం వల్ల ప్రయాణికులు, ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్‌లోని వారు తీవ్ర ఆందోళనకు గురయ్యేవారు.
చార్ట్ తయారీ ఇలా..
ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోగా బయల్దేరే రైళ్లకు మొదటి రిజర్వేషన్ చార్ట్‌ను అంతకుముందు రోజు రాత్రి 8 గంటలకు సిద్ధం చేస్తారు. మధ్యాహ్నం 2.01 గంటల నుంచి అర్ధరాత్రి 11.59 గంటలలోగా, అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటలలోగా ప్రయాణించే రైళ్లకు ఫస్ట్ రిజర్వేషన్ చార్ట్‌ను సంబంధిత రైలు బయల్దేరడానికి 10 గంటల ముందు తయారు చేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

