MODI TOUR: శాకాహార వంట... ఒప్పందాల పంట
ఫ్రాన్స్ పర్యటన అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) వెళ్లిన ప్రధాని మోదీ(PM MODI) కీలక ఒప్పందాలు చేసుకున్నారు. రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన అనంతరం UAE వెళ్లిన మోదీకి అబుదాబి విమానాశ్రయంలో UAE యువరాజు షేక్ ఖాలిద్ బిన్ మొహమద్ బిన్ జాయెద్ ఘన స్వాగతం పలికారు. ఐరాస వాతావరణ సదస్సు అధ్యక్షుడిగా నియమితులైన సుల్తాన్ అల్ జాబర్‌తో తొలుత మోదీ భేటీ అయ్యారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న కాప్-28 సదస్సుకు అధ్యక్షత వహించనున్న U.A.Eకి భారత్ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. వాతావరణ మార్పుల సమస్య పరిష్కారానికి భారత్ తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. ఈ వివరాలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి...ట్వీట్ చేశారు.
తర్వాత కస్ర్-అల్-వతన్- ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ చేరుకున్న మోదీకి లాంఛనప్రాయ స్వాగతం లభించింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్‌తో మోదీ భేటీ అయ్యారు. గత ఏడాది CEPA వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించాయి. స్థానిక కరెన్సీల్లోనే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడానికి ఇరుదేశాలు అంగీకరించాయి. స్థానిక కరెన్సీల్లో( local currencies) వాణిజ్యం.. ద్వైపాక్షిక పెట్టుబడులను మరింత పెంచుతాయని భేటీ అనంతరం మోదీ పేర్కొన్నారు. గత సంవత్సరం CEPA ఒప్పందం జరిగనప్పటి నుంచి భారత్ -యూఏఈల వాణిజ్యం 20 శాతం పెరిగిందని ప్రధాని వివరించారు.
UAE అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయేద్.. ప్రధాని మోదీ కోసం అధ్యక్ష భవనంలో ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. స్థానికంగా సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరగాయలతో పూర్తిగా శాకాహార పదార్థాలతో తయారు చేసిన విందును ప్రధానికి వడ్డించారు. గోధుమలు, ఖర్జూర సలాడ్‌లతో పాటుగా మసాలా సాస్, కాల్చిన కూరగాయలను స్టార్టర్‌లుగా అందించారు. ఈ విందుకు విచ్చేసిన ప్రముఖులకు క్యాలీ ఫ్లవర్, క్యారెట్ తందూరి, నల్ల పప్పు, హరీస్‌లను ప్రధానంగా వడ్డించారు. వీటితో పాటు స్థానికంగా పండించిన పండ్లను కూడా అందించారు.
వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ఆహారభద్రత, శాస్త్రసాంకేతికత, విద్య, ఫిన్ టెక్ , రక్షణ, భద్రత తదితర రంగాల్లో పరస్పర సంబంధాలు కొనసాగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 1981లో ఇందిరా గాంధీ యూఏఈ పర్యటన తరువాత, ఏ భారత ప్రధానీ అక్కడకు వెళ్లలేదు. 34 ఏళ్ల తరువాత 2015లో మోదీ యూఏఈలో పర్యటించారు. ఇప్పటి వరకు 4 సార్లు పర్యటించగా ఇది ఐదవ పర్యటన.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com