Ilaiyaraaja:పెద్దల సభకు ఎంపికైన ఇళయరాజా..రాజ్యసభ ఎంపీగా మ్యూజిక్ మాస్ట్రో..

Ilayaraja:సినీ సంగీత సరస్వతిగా పేరొందిన మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాను రాజ్యసభకు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. లలిత కళలకు చెందిన విభాగంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇళయరాజాతోపాటు, కథా రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. వీరిద్దరితోపాటు పరుగుల రాణి పీటీ ఉష, సామాజిక సేవాకర్త వీరేంద్ర హెగ్డే కూడా రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇళయరాజా ఇటీవల అంబేద్కర్ - మోదీ పుస్తకానికి ముందుమాటలో ప్రధాని మోదీ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇళయరాజా రాజ్యసభకు వెళ్తారన్న వార్తలు బలంగా వినిపించాయి. చివరకు అవే నిజమయ్యాయి.
సినీ సంగీత ప్రపంచంలో ఇళయరాజా పేరు వినని సంగీత ప్రియులు ఉండరు. తన విభిన్నమైన సంగీతంతో సరికొత్త బాణీలతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని ఆయన. తమిళ, తెలుగు చిత్రపరిశ్రమలలో ఎందరో మహామహులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. తన 40 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు ఇళయరాజా.
1993లో లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్హర్మోనిక్ ఆర్కెస్ట్రా తో ఒక పూర్తి స్తాయి సింఫనీని ఇళయరాజా కంపోజ్ చేసారు. ఆసియా ఖండంలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. 2010లో పద్మభూషణ్ పురస్కారం.. 2018లో పద్మవిభూషణ్ పురస్కారంతో పాటు పలు జాతీయ అవార్డులు ఆయన్ను వరించాయి. మొత్తంగా 5 సినిమాలకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారాలు..అందులో రెండు సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభాగంలో అవార్డు లభించాయి.
ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్. 1943, జూన్ 2 లో తమిళనాడులోని తేని జిల్లాలో పన్నియపురంలో జన్మించారు. తొలిసారిగా అన్నక్కలి అనే తమిళ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన పనిచేశారు. తెలుగులో భద్రకాళి చిత్రంతో సంగీత దర్శకుడుగా పరిచయమైన ఇళయరాజా.. మెల్ల మెల్లగా తన విభిన్నమైన వాయిద్యాలతో కొత్త తరహా స్వరాలను సంగీతాభిమానులకు రుచి చూపించారు. ఈ సినిమా తర్వాత తెలుగులో ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఇళయరాజాకు జాతీయ అవార్డులు తెచ్చిపెట్టిన తెలుగు సినిమాలు సాగర సంగమం, రుద్రవీణ. ఇలా రెండు తెలుగు సినిమాలతో జాతీయ అవార్డులు అందుకున్న అరుదైన ఘనత ఇళయరాజాకు మాత్రమే దక్కింది.
శాస్త్రీయ సంగీతానికి వెస్ట్రన్ మ్యూజిక్‌ని లింక్ చేసి ఎన్నో పాటలు స్వరపరిచి సరికొత్త సంగీతాన్ని అందించారు ఇళయరాజా. ఎ.ఆర్.రెహమాన్ ఇండస్ట్రీకి పరిచయం అవకముందు మణిరత్నం సినిమాలన్నింటికీ ఇళయరాజాయే మ్యూజిక్ చేశారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. తెలుగులో వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'గీతాంజలి' పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్. కమల్‌హాసన్, కె.విశ్వనాథ్ కాంబినేషన్‌లో వచ్చిన సాగర సంగమం, స్వాతిముత్యం చిత్రాలు ఇళయరాజా కెరీర్‌లో మైల్‌స్టోన్స్‌గా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా భారతీయ సినీ సంగీతంలో ఇళయరాజా ఓ లెజండ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com