Heavy Rainfall : శుక్ర, శనివారాల్లో పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు

దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శుక్రవారం వెదర్ బులెటిన్ లో వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్, ఉత్తరాఖండ్, ఢిల్లీల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో వచ్చే ఐదురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురవవచ్చని అంచనా . ఢిల్లీ, ఎన్సీఆర్, గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్ ప్రాంతాల్లో వచ్చే నాలుగురోజుల పాటటు వర్షాలు కురవనున్నాయి.
యూపీలోని లక్నో, గోరఖ్ పూర్, బరేలీ, దేవిపటాన్, బస్తీ, ప్రయాగరాజ్, మురాదాబాద్, ఝాన్సీ, మీరట్, కాన్పూర్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్, సిక్కిం, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లోనూ రెండు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కొండచరియలు విరిగిపడటం, అనేక ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి. ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హిమాచల్ ప్రదేశ్‌కు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆగస్ట్ 29 వరకు ఈ వర్షపాతం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా శుక్రవారం సిమ్లాలోని అన్ని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. కుంభ వృష్టి, భారీ వరదలకు తోడు కొండచరియలు విరిగిపడుతుండడంతో హిమాచల్ ప్రజలు ప్రాణాలను అరచేత పట్టుకుని బ్రతుకుతున్నారు. ఈ సంవత్సరం భారీ వర్షాల కారణంగా రాష్ట్ర ముఖచిత్రమే పూర్తిగా మారిపోయింది. కులు జిల్లాలోని ఆని పట్టణంలో కొండచరియలు విరిగిపడడంతో పలు భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడడంతో ఆని పట్టణంలోని మొత్తం ఏడు భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. కులు-మండి హైవేపై కొండచరియలు విరిగిపడటంతో వందల సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకుపోయారు. ప్రకృతి ప్రకోపాల కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో రూ. 10 వేల కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. 224 మంది ప్రాణాలు కోల్పోయారు. 113 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com