SC: రాష్ట్రపతికే గడువు విధించిన సుప్రీంకోర్టు

SC: రాష్ట్రపతికే గడువు విధించిన సుప్రీంకోర్టు
X
సుప్రీంకోర్టు సంచలన తీర్పు... దేశ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతికి గడువు

పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్రపతికి గడువు నిర్దేశించింది. రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులపైనా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈతరహా తీర్పు చెప్పడం భారత న్యాయ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్, రాష్ట్రపతి ఎక్కువ కాలం తొక్కిపెట్టలేరని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ ఈ సమయం దాటితే, ఆలస్యానికి సముచిత కారణాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పింది. రాష్ట్రపతి అసెంట్‌ను నిరాకరించినా లేదా బిల్లును అనవసరంగా ఆలస్యం చేసినా, రాష్ట్ర ప్రభుత్వం దీనిని కోర్టులో సవాలు చేయవచ్చని కూడా సుప్రీంకోర్టు చరిత్రలో నిలిచిపోయే తీర్పునిచ్చింది. ఒక బిల్లు రాజ్యాంగ విరుద్ధమని గవర్నర్ రాష్ట్రపతికి పంపితే, రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు సలహా తీసుకోవాలని సూచించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 ప్రకారం, గవర్నర్ ఒక బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం పంపితే, రాష్ట్రపతి దానికి అసెంట్ ఇవ్వవచ్చు, నిరాకరించ వచ్చు. అయితే ఈ ప్రక్రియకు రాజ్యాంగంలో నిర్దిష్ట సమయ పరిమితి లేదు. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు, సుప్రీంకోర్టు మూడు నెలల గడువు నిర్దేశించడం ఒక చారిత్రక నిర్ణయమని పలువురు న్యాయ కోవిధులు అంచనా వేస్తున్నారు.

గవర్నర్లపైనా ఘాటు వ్యాఖ్యలు

తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికుమార్‌ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్‌ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు వెలువరించింది. గవర్నర్‌ ఈ కాల నిర్దేశాన్ని పాటించనిపక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రి మండలి సలహా మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్‌కు విచక్షణాధికారాలేవీ లేవని, రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇదే ప్రథమం. సుప్రీంకోర్టు తీర్పుతో రాజ్యాంగ చరిత్రలోనే తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే తమిళనాడు ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేసింది. ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది.

Tags

Next Story