Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో మరోసారి అగ్నిప్రమాదం

Maha Kumbh Mela 2025:  ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో మరోసారి అగ్నిప్రమాదం
X
శంకరాచార్య మార్గ్‌ లోని సెక్టార్-18లో అగ్నిప్రమాదం

నేడు (శుక్రవారం) ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. వార్త అందే సమయానికి మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. శంకరాచార్య మార్గ్‌ లోని సెక్టార్-18లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. దీని కారణంగా అక్కడ ఉన్న అనేక టెంట్లు బూడిదయ్యాయి. టెంట్ కు మంటలు అంటుకున్న వెంటనే చుట్టుపక్కన ఉన్న ప్రజలను ఖాళీ చేయించారు. అయితే అక్కడ గాలి బలంగా వీస్తున్నందున, మంటలు వేగంగా వ్యాపించాయి.దాంతో, సమీపంలోని ఇతర గుడారాలలో నివసించే ప్రజలు బయటకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదని తెలుస్తోంది. అయితే, అగ్నిప్రమాదానికి కారణమేమిటో ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కాగా, ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన ఈ కుంభమేళాలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మౌని అమావాస్య సందర్భంగా గత నెల 29వ తేదీన కుంభమేళా ప్రాంతంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 60 మంది గాయపడ్డారు. ఇక కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి అప్పటి వరకూ అక్కడ అగ్నిప్రమాదం జరగడం ఇది నాలుగోసారి.

తొలుత ఈనెల 19వ తేదీన మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఎల్పీజీ సిలిండర్‌ పేలడంతో సెక్టార్‌ 19లో మంటలు చెలరేగి 18 గుడారాలు ఆహుతయ్యాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. నల్లటి దట్టమైన పొగలు అలుముకోవడంతో అఖాడాల సమీపంలో భయాందోళన నెలకొంది. సాయంత్రం 4 గంటలకు మంటలు అంటుకోగా గంటలోపలే మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. ఆతర్వాత వారం రోజులకే అంటే ఈనెల 25వ తేదీన మరోసారి అగ్నిప్రమాదం జరిగింది.

కుంభమేళాకు వెళ్లే ప్రధాన రహదారిలోని సెక్టార్‌ 2 సమీపంలోని పార్కింగ్‌ ఏరియాలో మంటలు చెలరేగాయి. అక్కడ విపరీతమైన వేడి కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఓ కారు పూర్తిగా దగ్ధం కాగా, మరో కారు పాక్షికంగా దెబ్బతిన్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత జనవరి 30న సెక్టర్‌ 22లో ఛత్నాగ్‌ ఝాన్సీ ప్రాంతంలో నిర్మించిన టెంట్‌ సిటీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో డజనుకుపైగా టెంట్లు కాలిపోయాయి. అయితే, ఈ మూడు ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

Tags

Next Story