Manipur: అమానుషం... మహిళలను వివస్త్రలను చేసి

Manipur: అమానుషం... మహిళలను వివస్త్రలను చేసి
X
మణిపుర్‌లో మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు...

జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో చెలరేగిన అల్లర్ల మాటున మహిళలపై జరిగిన దారుణ అమానుషాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి. ఉద్యమం చేస్తున్న ఒక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో బయటకు రావడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ పరిణామంతో మళ్లీ మణిపుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు వేడెక్కాయి. ఈ దారుణ ఘటనపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఇది పూర్తిగా హేయమైన చర్యని మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

మే 4న కాంగ్‌పోక్పి జిల్లాలో తీసినట్లుగా చెబుతున్న వీడియోలో మహిళల చుట్టూ కొందరు పురుషులు నడుస్తూ వస్తున్నారు. వారంతా కలిసి సమీపంలోని పొలంలో బాధిత మహిళలపై అత్యాచారం చేశారని ఓ గిరిజన సంస్థ ఆరోపించింది. అనంతరం ఆ మహిళలను గ్రామ వీధుల్లో పురుషులు నగ్నంగా ఊరేగిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోప్కి జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. . ఇది బయటకు రావడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఇందుకు ఒకరోజు ముందే ఆ రాష్ట్రంలో రెండు తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో అక్కడి మహిళలు తీవ్ర వ్యధను అనుభవించారు.

గుర్తుతెలియని సాయుధ దుండగులపై అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కింద నాంగ్‌పాక్‌ సెక్‌మై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇండిజీనియస్‌ ట్రైబల్‌ లీడర్స్‌ ఫోరం నిరసన ర్యాలీ నిర్వహించాలని తలపెట్టిన తరుణంలో ఈ వీడియో వైరల్‌ కావడం మరింత ఆందోళనకు కారణమవుతోంది. ఘటనను ఖండిస్తూ పలువురు రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు, గిరిజన నాయకులు పోస్టులు పెట్టారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు... మిలిటెంట్ల చేతుల్లో ఇప్పటికీ 6 లక్షల బుల్లెట్లు, 3 వేలకు పైగా ఆయుధాలు ఉన్నట్టు భద్రతా దళాల సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 303 రైఫిల్స్‌, మీడియం మెషిన్‌ గన్స్‌, ఏకే అస్సాల్ట్‌ రైఫిల్స్‌ కార్బైన్స్‌, లైట్‌ మెషిన్‌ గన్స్‌ దోపిడీకి గురైనట్టు, అవి మిలిటెంట్ల వద్దే ఉన్నట్టు వెల్లడించారు. ఇంఫాల్‌లోని పోలీస్‌ శిక్షణ కేంద్రం నుంచి 4,537 ఆయుధాలు, 6.32 లక్షల పేలుడు పదార్థాలు దోపిడీకి గురయ్యాయని తెలిపారు. వాటిలో కొన్ని స్వాధీనం చేసుకోగా మిలిగినవి ఇప్పటికీ మిలిటెంట్ల చేతుల్లోనే ఉన్నట్టు వెల్లడించారు. యునైటెడ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌, పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ, కాంగ్లే యావోల్‌, కంబా లుప్‌ తదితర నిషేధిత సంస్థలు మళ్లీ పుంజుకున్నాయని అధికారులు తెలిపారు. వీటిలో కొన్ని సంస్థలు మిలిటెంట్లకు సహకరిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు.

Next Story