Lok Sabha Speaker Election: ఓం బిర్లా X సురేశ్, లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక

లోక్‌సభ స్పీకర్ పదవికి ఈ సారి ఎన్నిక అనివార్యమైంది. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ప్రతిపక్షాలతో జరిపిన చర్చలు ఫలించలేదు. డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వాలన్న షరతుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో స్పీకర్ స్థానానికి విపక్ష ఇండియా కూటమి అభ్యర్థిని నిలిపింది. ఎన్డీయే కూటమి తరఫున మాజీ స్పీకర్ ఓం బిర్లా పోటీ చేస్తుండగా, ఇండియా కూటమి తరఫున సీనియర్ ఎంపీ కొడికున్నిల్ సురేశ్ బరిలో నిలిచారు. దీంతో గత 50 ఏండ్లలో తొలిసారిగా, స్వతంత్ర భారత చరిత్రలో మూడోసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరుగనున్నది. వాస్తవానికి స్పీకర్ పదవిని అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షం చేపట్టడం సంప్రదాయంగా వస్తున్నది. అయితే గత పర్యాయంలో డిప్యూటీ స్పీకర్‌ను నియమించలేదు. ఈసారి ఎన్నికల్లో మెరుగైన సీట్లు సాధించిన ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పట్టుబట్టింది. అందుకు కేంద్రం అంగీకరించకపోవడంతో స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలిపింది.
అధికార పక్షం ఎన్డీఏ తరఫున రాజస్థాన్‌లోని కోటా నియోజకవర్గం నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా 10 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, నడ్డా, బీజేపీ మిత్రపక్షాలు తెలుగుదేశం, జేడీయూ, జేడీఎస్, ఎల్‌జేపీ ఆయనకు మద్దతుగా నామినేషన్ సెట్లు దాఖలు చేశాయి. విపక్ష ఇండియా కూటమి తరఫున కేరళ నుంచి 8సార్లు కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఎన్నికైన కె.సురేశ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా మూడుసెట్ల నామినేషన్ పత్రాలు దాఖలైనట్లు సమాచారం.
18వ లోక్‌సభకు అనివార్యంగా జరుగుతున్న కొత్త స్పీకర్ ఎన్నిక స్వతంత్ర భారతదేశ చరిత్రలో మూడోది అని, దాదాపు గత 50 ఏండ్లలో తొలిసారి అని పార్లమెంట్ వర్గాలు చెబుతున్నాయి. 1952 తర్వాత స్పీకర్ పోస్టుకు ఎన్నిక జరుగనుండటం ఇది మూడోసారి. లోక్‌సభ సెక్రటేరియట్ వివరాల ప్రకారం మొదటగా 1952 తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన స్పీకర్ ఎన్నికలో శంకర్ శాంతారాంపై జీవీ మౌలాంకర్ గెలిచారు. మౌలాంకర్‌కు 394 ఓట్లు రాగా, శాంతారంకు 55 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 1976లో రెండోసారి బాలిరాం భగత్, జగన్నాథ్ రావ్ మధ్య అలాంటి పోటీ జరిగింది. 344-58 ఓట్ల తేడాతో జగన్నాథ్ రావ్‌పై భగత్ విజయం సాధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com