Sabarimala: శబరిమలలో మహిళల ప్రవేశంపై మళ్లీ న్యాయపోరాటం..

కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయ ఆచారాలకు సంబంధించిన వివాదం మరోసారి కీలక మలుపు తిరిగింది. అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి ప్రవేశించవచ్చంటూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సవాలు చేయాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) నిర్ణయించింది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు తీర్మానం ఆమోదించింది. గతంలో ఇదే తీర్పును అమలు చేయడానికి ప్రయత్నించిన బోర్డు, ఇప్పుడు దానికి వ్యతిరేకంగా న్యాయపోరాటానికి సిద్ధం కావడం గమనార్హం.
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత కేరళ వ్యాప్తంగా భక్తులు, హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయ్యప్ప స్వామి నైష్ఠిక బ్రహ్మచారి అని, ఆలయ సంప్రదాయాలను గౌరవించాలని భక్తులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. క్షేత్రస్థాయిలోని ఈ మనోభావాలను, ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పాత తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బోర్డు నిర్ణయించింది.
2018 సెప్టెంబర్ 28న అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం 4:1 మెజారిటీతో మహిళల ప్రవేశానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే, ఆ బెంచ్‌లోని ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా మాత్రం మత విశ్వాసాల్లో కోర్టుల జోక్యం సరికాదని భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు దేవస్వం బోర్డు కూడా ఇదే పాయింట్‌ను ప్రధానంగా ప్రస్తావిస్తూ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది.
ఇప్పటికే ఈ అంశంపై పలు రివ్యూ పిటిషన్లు సుప్రీంకోర్టులోని ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం వద్ద విచారణలో ఉన్నాయి. తాజాగా ఆలయ నిర్వాహక బోర్డే స్వయంగా రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. బోర్డు నిర్ణయం పట్ల అయ్యప్ప భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
