Sonia Gandhi: ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ

సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ నిర్వహించే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా వివరాలను కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బుధవారం లేఖ రాశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండా వెల్లడించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరిపే ముందు ప్రతిపక్షాలతో చర్చలు జరపడం ఆనవాయితీ అనీ కానీ ఎలాంటి చర్చలు జరపకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చిందని సోనియా గాంధీ విమర్శించారు.
ఈ సమావేశాలను ఏకపక్షంగా ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రత్యేక సమావేశాలకు ముందే అన్నిపార్టీలతో చర్చించి అజెండా తయారు చేయాల్సి ఉండిందని, కానీ తమకు అలాంటి సమాచారం లేదని సోనియా తన లేఖలో ప్రస్తావించారు. ప్రత్యేక సమావేశాల బులెటిన్ లో 5రోజుల సమావేశాల్లో ప్రభుత్వకార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు అది అసాధ్యమన్నారు. గత సమావేశాల్లో ఏవైతే అంశాలను తాము లేవనెత్తలేదో....వాటిపై ఈసారి చర్చకు డిమాండ్ చేయనున్నట్లు సోనియా తెలిపారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండాలో 9 అంశాలు చేర్చాలని కోరారు. అదానీ గ్రూప్ లో అక్రమాలు, మణిపుర్ లో హింసాత్మక ఘటనలు, రైతు సమస్యలు, కనీస మద్దతు ధరపై హామీ, కులాల వారీగా జనగణన, కేంద్ర, రాష్ట్రాల మధ్య దిగజారుతున్న సంబంధాలు, ప్రకృతి వైపరిత్యాల సమయంలో ప్రజలను ఆదుకోవటం, హరియాణాలో మత ఘర్షణలు, సరిహద్దుల్లో చైనా ఆక్రమణ అంశాలు చేర్చాలని సూచించారు.
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన డిన్నర్ భేటీలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్ష పార్టీలు చర్చించాయి. అజెండా వెల్లడించకుండా మోదీ సర్కార్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడం సరైంది కాదని భేటీ అనంతరం ఖర్గే పేర్కొన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, మణిపూర్, చైనా దురాక్రమణ, కాగ్ నివేదికలు, స్కామ్‌లు, వ్యవస్ధల నిర్వీర్యం వంటి కీలక అంశాలపై చర్చను పక్కదారి పట్టించేలా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
జమిలి ఎన్నికలకోసం కమిటీ వేయడంతో, అసలు పార్లమెంట్ సమావేశాల అజెండా కూడా అదేనంటూ వార్తలు వినపడుతున్నాయి. ఇండియా పేరు భారత్ గా మార్చే అంశం కూడా ఇందులో ఉంటుందని చెబుతున్నారు. మహిళా బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం కూడా ఉందంటున్నారు. సభ్యులందరితో గ్రూప్ ఫొటోకి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని, అంటే.. ఇవే చివరి సమావేశాలు కావొచ్చనే పుకార్లు కూడా గుప్పుమంటున్నాయి. ఇంత జరుగుతున్నా కేంద్రం మాత్రం నోరు మెదపడంలేదు. అధికారికంగా అజెండా ఇదీ అంటూ చెప్పడంలేదు. దీనిపై ఇన్నాళ్లూ మీడియా ముందు ప్రశ్నించిన విపక్షాలు ఇప్పుడు నేరుగా మోదీనే ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ నేత సోనియాగాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com