INDIA bloc rally: దేశ ప్రజలకోసం ఆరు గ్యారెంటీలు..

INDIA bloc rally:  దేశ ప్రజలకోసం ఆరు గ్యారెంటీలు..
కేజ్రీవాల్‌ ఆరు హామీలను వెల్లడించిన భార్య సునీత

ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహిస్తున్న ఇండియా అలయన్స్ సేవ్ డెమోక్రసీ ర్యాలీలో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీ కేజ్రీవాల్ మీకు జైలు నుంచి సందేశాన్ని పంపించారు.. ఈ సందేశాన్ని చదివే ముందు నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మన ప్రధాని నరేంద్ర మోదీ నా భర్తను జైల్లో పెట్టారు. ప్రధానమంత్రి చేసింది సరైనదేనా? కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడు, నిజాయితీ పరుడని మీరు నమ్ముతున్నారా? అంటూ ఆమె సభలో పాల్గొన్న వారిని ప్రశ్నించారు. కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ వాళ్లు అంటున్నారు.. మీ కేజ్రీవాల్ సింహం. కోట్లాది ప్రజల హృదయాల్లో ఆయన ఉన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో పోరాడుతూ అమరుడయ్యాడని, మళ్లీ ఈ జన్మలో కూడా కేజ్రీవాల్ ను భారతమాత కోసం పోరాడేందుకు దేవుడు పంపాడని నాకు కొన్నిసార్లు అనిపిస్తుందంటూ సునీతా కేజ్రీవాల్ పేర్కొన్నారు.

నేను ఓట్లు అడగడం లేదు.. ఎవరిని గెలిపించమని, ఓడించమని కోరడం లేదు. నూతన భారతాన్ని నిర్మించుకోవాలి. జైలులో దేశం గురించి ఆలోచించడానికి చాలా సమయం ఉంది. భారత మాత బాధలో ఉంది. దేవుడు భారత్ కు అన్ని ఇచ్చాడు.. అయినా దేశంలో అభివృద్ధి లేదు. పేదరికంలో ఉన్నాం.. బీజేపీ తమ మిత్రులతో కలిసి దేశాన్ని దోచుకుంటుంది అంటూ కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన సతీమణి సునీతా వినిపించారు.

కాగా, లిక్కర్‌ పాలసీ కేసులో ఈడీ అరెస్ట్‌ వల్ల జైలులో ఉన్న భర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతిపాదించిన ఆరు హామీలను సునీతా కేజ్రీవాల్‌ చదివి వినిపించారు. దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్, దేశంలో పేదలకు ఉచిత విద్యుత్, ప్రతి గ్రామం, మొహల్లాకు మంచి ప్రభుత్వ పాఠశాల, మొహల్లా క్లినిక్, స్వామినాథన్ కమిటీ నివేదిక ప్రకారం రైతులకు మద్దతు ధర లభిస్తుందని చెప్పారు.

మరోవైపు గత 75 ఏళ్లలో ఢిల్లీ ప్రజలు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారని సునీతా కేజ్రీవాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. భారత కూటమి అధికారంలోకి వస్తే ఢిల్లీని పూర్తి స్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దుతుందని తెలిపారు. తాను ఇవాళ ఓట్లు అడగడం లేదని, నవ భారత నిర్మాణం కోసం 140 కోట్ల మంది భారతీయులను ఆహ్వానిస్తున్నానని ఆమె అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story