INDIA bloc: జూన్ 1న ఇండియా కూటమి సమావేశం

లోకసభ ఎన్నికల్లో పనితీరు, రాబోయే ఫలితాలపై చర్చించేందుకు ‘ఇండియా కూటమి’ పార్టీలు జూన్ 1న న్యూఢిల్లీలో సమావేశం కాబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ రోజు మధ్యాహ్నం ఈ సమావేశం ఏర్పాటుచేసినట్టు సంబంధిత వర్గాలు సోమవారం తెలిపాయి. కాగా, ఈ సమావేశానికి హాజరుకావటం లేదని తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉన్నందున సమావేశానికి రాలేమని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, పార్టీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ సమావేశానికి నేతృత్వం వహిస్తారని తెలిసింది. అయితే ఈ భేటీకి తాము హాజరు కాబోమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో లోక్ సభ ఎన్నికలు, జూన్ 4న ఫలితాలు, కూటమి భవిష్యత్తుపై చర్చించనున్నారు.
ఈ సమావేశంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ జూన్ 1న ఇండియా కూటమి సమావేశం నిర్వహిస్తోందని తెలిపారు. కానీ బెంగాల్లో 9 లోక్ సభ స్థానాల్లో అదేరోజు ఎన్నికలు ఉన్నందున తాను ఢిల్లీ సమావేశం కోసం రాలేనని చెప్పానని వెల్లడించారు. పంజాబ్, బీహార్, ఉత్తర ప్రదేశ్‌లలో కూడా జూన్ 1న ఎన్నికలు ఉన్నాయని అందుకే ఢిల్లీకి వెళ్లడం ఆచరణాత్మకం కాదన్నారు.
ఓ వైపు తుపాను మరోవైపు ఎన్నికలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో తనకు తుపాను సహాయ కార్యక్రమాలే తనకు తొలి ప్రాధాన్యత అన్నారు. ఏడో దశలో తమకు చాలా కీలకమైన ఎన్నికలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ రోజున కోల్‌కతా, గ్రేటర్ కోల్‌కతాలోని అన్ని స్థానాలకు పోలింగ్ ఉందని తెలిపారు. తమ పార్టీకి ఇది చాలా కీలకమని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com