INDIA Bloc: ఎన్నికల సంఘానికి ఇండియా కూటమి 5 డిమాండ్లు

INDIA Bloc: ఎన్నికల సంఘానికి ఇండియా కూటమి 5 డిమాండ్లు
కేజ్రీవాల్‌, సోరేన్‌లను వెంటనే విడుదల చేయాలన్న ఇండియా కూటమి

ఢిల్లీ రామ్ లీలా మైదానం వేదికగా ఇండియా కూటమి నేతలు మహార్యాలీని నిర్వహించారు. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఢిల్లీలో ఆదివారం(మార్చ్‌ 31) భారీ సభ నిర్వహించిన ఇండియా కూటమి ఐదు డిమాండ్లు చేసింది. ఈ డిమాండ్లను కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకగాంధీ చదివి వినిపించారు.ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేయడంపై బీజేపీపై విరుచుకుపడ్డారు. ఈడీ, ఐటీ, సీబీఐలతో ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఇందులో కాంగ్రెస్‌, ఎన్సీపీ, ఎస్పీ, టీఎంసీ, ఆప్‌ సహా సుమారు 28 పార్టీల సీనియర్‌ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలను మోడీ నాశనం చేశారని మండిపడ్డారు. ఈ దేశాన్ని రక్షించాలని మనమంత ఒకటయ్యామన్నారు. ప్రజాస్వామ్యం కావాలో లేక నియంతృత్వం కావలో మీరే తేల్చుకోవాలన్నారు. నియంతృత్వాన్ని సమర్థించే వారిని దేశం నుంచి తరిమి కొట్టాలని పిలుపు నిచ్చారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు విషం లాంటివని అని మండిపడ్డారు.

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోని అన్ని పార్టీలకు సమాన అవకాశాలివ్వాలని ఎన్నికల కమిషన్‌(ఈసీ)ని కూటమి డిమాండ్‌ చేసింది. ఎన్నికల్లో సీబీఐ, ఈడీ, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేయడాన్ని ఈసీ అడ్డుకోవాలి. సీఎం కేజ్రీవాల్‌, మాజీ సీఎం హేమంత్‌ సొరేన్‌లను వెంటనే విడుదల చేయాలి. ప్రతిపక్ష పార్టీలను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలను వెంటనే ఆపాలి.

బీజేపీ చేస్తున్న కక్షపూరిత రాజకీయాలు, అక్రమ వసూళ్లు, ఎన్నికల బాండ్ల ద్వారా చేస్తున్న మనీలాండరింగ్‌పై విచారించడానికి సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేయాలి’ అని ఇండియా కూటమి నేతలు డిమాండ్‌ చేశారు. ఈ ఎన్నికల తర్వాత బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తోందని, ఆ తర్వాత దేశం మంటల్లో కూరుకుపోతుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఈ ర్యాలీలో ఏఐసీసీ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌, శివసేన యూబీటీ నేత ఉద్ధవ్‌ థాక్రే, అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీత, హేమంత్‌సోరేన్‌ భార్య కల్పన సోరేన్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags

Read MoreRead Less
Next Story