INDIA bloc: 31న ఇండియా కూటమి ‘మెగా మార్చ్‌’

INDIA bloc:  31న ఇండియా కూటమి ‘మెగా మార్చ్‌’
కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా..

డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ విపక్ష ఇండియా కూటమి మెగా మార్చ్‌కు సిద్ధమైంది. మార్చి 31న రాంలీలా మైదానంలో మహార్యాలీ చేపట్టనున్నట్లు ఇండియా కూటమి నేతలు వెల్లడించారు. దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఈ మెగా మార్చ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆప్‌ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ మార్చి 31న విపక్ష ఇండియా కూటమి ...రాంలీలా మైదానంలో మహా ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆప్‌ సీనియర్‌ నేత గోపాల్‌ రాయ్‌ ప్రకటించారు. విపక్ష కూటమిలోని కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ దిల్లీలో సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించాయి. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌కు మార్చి 28 వరకు న్యాయస్థానం కస్టడీని విధించింది. ఈ నేపథ్యంలో దేశంలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఈ మహార్యాలీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ర్యాలీలో ఇండియా కూటమి అగ్రనేతలు పాల్గొంటారని ఆప్‌ దిల్లీ కన్వీనర్‌ గోపాల్‌ రాయ్‌ తెలిపారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న రాయ్‌..దేశ ప్రయోజనాలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

రాజకీయ నాయకులను బెదిరింపులకు గురిచేయడం సహా విపక్షాల అడ్డు తొలగించేందుకు దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని ఆప్‌ నేత గోపాల్‌ రాయ్‌ మండిపడ్డారు. ఝార్ఖండ్‌లో హేమంత్‌ సోరెన్‌, బిహార్‌లో తేజస్వి యాదవ్‌పై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. కేజ్రీవాల్‌ కుటుంబాన్ని గృహ నిర్బంధం చేయడం సహా, ఆప్‌ కార్యాలయాన్నీ సీజ్‌ చేశారని పేర్కొన్నారు. మార్చి 31 న నిర్వహించే మహార్యాలీ రాజకీయ ప్రయోజనాలకోసం కాదని....దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకని దిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అరవింద్‌ సింగ్‌ లవ్లీ వెల్లడించారు. ముఖ్యమంత్రులను అరెస్టు చేయడం, రాజకీయ పార్టీల ఖాతాలను నిలిపివేయడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలపై విపక్ష పార్టీలు కలిసి పోరాడతాయని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story