DRDO: అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారీ

దేశంలోని భద్రతా బలగాల కోసం డీఆర్‌డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) మరో పరికరాన్ని విజయవంతంగా పరీక్షించింది. అత్యధిక ముప్పు స్థాయి నుంచి రక్షణ కోసం అత్యంత తేలికైన బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ను అభివృద్ధి చేసింది. తీవ్రమైనదిగా పరిగణించే లెవెల్- 6 ముప్పుని సైతం ఎదుర్కొనేలా దీనిని రూపొందించింది. ఈ జాకెట్ 7.62 x 54 ఆర్ ఏపీఏ మందుగుండు సామగ్రి పేలుడు నుంచి కూడా రక్షణనిస్తుందని డీఆర్‌డీవో ప్రకటనలో పేర్కొంది. కొత్త ప్రక్రియలో నూతన మెటీరియల్‌ను ఉపయోగించి దీనిని రూపొందించినట్టు పేర్కొంది. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం. ఈ జాకెట్‌ని కొత్త డిజైన్‌లో, ఎర్గోనామిక్‌గా రూపొందించబడిన ఫ్రంట్ HAP పాలిమర్ బ్యాకింగ్, మోనోలిథిక్ సిరామిక్ ప్లేట్‌తో దీన్ని తయారు చేశారు. బుల్లెట్ల నుంచి ఇది మంచి రక్షణగా తోడ్పడుతుంది.
కాన్పూర్‌లోని డీఆర్‌డీవో విభాగం డీఎంఎస్ఆర్‌డీఈ (డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్) దీనిని తయారు చేసిందని తెలిపింది. మందుగుండు సామాగ్రి నుంచి కూడా రక్షణ ఇవ్వగలదని, దేశంలోనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇదేనని పేర్కొంది. ఇటీవలే ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ విజయవంతంగా పరీక్షించినట్టు తెలిపింది. చండీగఢ్‌లో పరీక్ష నిర్వహించినట్టు వివరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com