Mohan Bhagwat: ఆరెస్సెస్ ముస్లిం వ్యతిరేక సంస్థ కాదన్న ఆరెస్సెస్ చీఫ్

"సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.. దీనికి రాజ్యాంగం నుంచి ప్రత్యేకంగా ఆమోదం అవసరమా? భారత్ హిందూ రాష్ట్రం అన్నది కూడా అలాంటి సత్యమే" అని ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. కోల్‌కతాలో జరిగిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ.. హిందూ రాష్ట్రం అనే భావనపై తన అభిప్రాయాలను ఆయన స్పష్టంగా వివరించారు.
భారత్‌ను హిందూ రాష్ట్రంగా ప్రకటించేందుకు పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేదని భగవత్ పేర్కొన్నారు. "ఎవరు ఈ దేశాన్ని మాతృభూమిగా భావిస్తారో, ఎవరు ఇక్కడి సంస్కృతిని గౌరవిస్తారో.. అప్పటి వరకు భారత్ హిందూ రాష్ట్రమే. రాజ్యాంగంలో ఆ పదాన్ని చేర్చినా, చేర్చకపోయినా మాకు అది ముఖ్యం కాదు. ఎందుకంటే ఇది ఒక సత్యం" అని ఆయన పేర్కొన్నారు. అలాగే, పుట్టుకతో వచ్చే కుల వ్యవస్థ హిందుత్వ లక్షణం కాదని ఆయన గుర్తుచేశారు.
సంఘ్ ముస్లిం వ్యతిరేక సంస్థ అనే ప్రచారాన్ని భగవత్ కొట్టిపారేశారు. "ఆర్ఎస్ఎస్ పారదర్శకమైన సంస్థ. మాపై మీకు అనుమానం ఉంటే ఎప్పుడైనా వచ్చి చూడవచ్చు. మేము కేవలం హిందువులను సంఘటితం చేస్తాం, అంతమాత్రాన మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు" అని వివరించారు. హిందుత్వ అనేది ఒక సంకుచిత మతపరమైన గుర్తింపు కాదని, అది ఒక జీవన విధానమని ఆయన పునరుద్ఘాటించారు.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. "హిందువులకు ఉన్న ఏకైక దేశం భారత్ మాత్రమే. బంగ్లాదేశ్‌లోని హిందువులు తమ రక్షణ కోసం ఐక్యంగా ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా వారికి అండగా నిలవాలి" అని ఆయన పిలుపునిచ్చారు.
లివ్-ఇన్ రిలేషన్ షిప్స్ పై స్పందిస్తూ.. అది బాధ్యత నుంచి తప్పించుకోవడమేనని విమర్శించారు. వివాహ వ్యవస్థ అనేది కేవలం శారీరక తృప్తి కోసం మాత్రమే కాదని, అది సమాజానికి మూలమని చెప్పారు. దేశ జనాభాను సరిగ్గా నిర్వహించలేకపోయామని, 50 ఏళ్ల ప్రొజెక్టన్‌తో ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకురావాలని సూచించారు. డాక్టర్లు, నిపుణుల సలహా మేరకు ముగ్గురు పిల్లలు ఉంటే కుటుంబంలో 'అహం' తగ్గుతుందని, ఆరోగ్యం బాగుంటుందని తనకు తెలిసిందని భగవత్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

