Sugar Exports Ban : చక్కెర ఎగుమతులపై నిషేధం ?

Sugar Exports Ban : చక్కెర ఎగుమతులపై నిషేధం ?
ఏడేళ్లలో మొదటిసారి...

దేశంలో చక్కెర ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. పంచదార లేక కాఫీ, టీలు చేదెక్కే రోజులు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుంది. చక్కెర ధరలు పెరగకుండా కళ్లెం వేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా, ఏడేళ్లలో తొలిసారి చక్కెర ఎగుమతులపై నిషేధం విధించాలని యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చక్కెర ధరలకు రెక్కలు వచ్చే అవకాశముండటంతో పాటు భారతదేశంలో చెరకు దిగుబడి గణనీయంగా తగ్గినందున చక్కెర ఎగుమతులను కేంద్రం నిలిపివేసే అవకాశం ఉంది.

భారతదేశం పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం ఎదుర్కొంటున్న నేపథ్యంలో సరఫరాలను స్థిరీకరించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అత్యధికంగా చెరకు పండించే మహారాష్ట్ర, కర్ణాటకలలో రుతుపవనాల వర్షాలు సగటు కంటే 50 శాతం తక్కువగా కురవడంతో చెరకు దిగుబడి తగ్గింది. దీంతో అక్టోబర్‌ నెలతో ప్రారంభమయ్యే తదుపరి సీజన్‌లో చక్కెర ఎగుమతులపై భారతదేశం నిషేధించవచ్చని సమాచారం.

ప్రపంచ ఆహార మార్కెట్‌లలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. దీంతో ఏడేళ్లలో జరగని విధంగా చక్కెర ఎగుమతులై నిషేధాస్త్రం విధించనుందని సమాచారం. ఆహార ద్రవ్యోల్బణంపై భారతదేశం ఆందోళన చెందుతోంది. రిటైల్ ద్రవ్యోల్బణం జులై నెలలో 15 నెలల గరిష్ట స్థాయి 7.4 శాతానికి చేరుకుంది. ఆహార ద్రవ్యోల్బణం 11.5 శాతానికి చేరుకుంది. ఇది మూడేళ్లలో అత్యధికం.


దక్షిణాసియా దేశాల నుంచే ప్రపంచం అంతా చెక్కెర ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే భారత్ వంటి దేశంలో అసమానమైన వర్షపాతం నమోదు కావడం వంటివి చెరుకు పంట దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీంతో చెరుకు దిగుబడి బాగా తగ్గింది. ఇదే చక్కెర ఎగుమతి పై నిషేధం విధించాలని నిర్ణయించుకోవడానికి కారణంగా ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

దేశీయం గా ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే గోధుమలు ,బియ్యం పై నిషేధం విధించగా , ఇప్పుడు ఆ లిస్టులో ఇప్పుడు చెక్కర చేరబోతోంది. భారత్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అగ్రదేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి.ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ గా ఉన్న భారత్ నుంచి ఎగుమతులు నిలిచిపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ప్రపంచ దేశాల్లో నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story